వనపర్తి టౌన్/ గోపాల్పేట/ ఖిల్లాఘణపురం/ బిచ్కుంద(జుక్కల్)/ బంట్వారం, జనవరి 31: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీచేయడంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. రాజకీయ కక్షతోనే నోటీసులు జారీ చేశారంటూ మండిపడుతున్నారు. ఈ మేరకు శనివారం పలు జిల్లాల్లో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
నోటీసుల పేరుతో ఇబ్బందులు పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక నోటీసుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతున్నదని దుయ్యబట్టారు. ఆధారాలు లేని ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

వనపర్తి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్ ఆధ్వర్యలో నిరసన తెలిపారు. అలాగే గోపాల్పేట, ఖిల్లాఘణపురం మండల కేంద్రాల్లోనూ గులాబీ పార్టీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. భిక్కనూరు మండలంలోనూ నిరసన తెలిపారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్‌లో నిరసనకు దిగారు. వికారాబాద్ జిల్లా బంట్వారంలో సర్పంచ్ దుర్గంచెర్వు మల్లేశం ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. కోట్‌పల్లి మండలం బీరోల్, జిన్నారం గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు.