మాగనూరు, జూలై 5 : నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో ఇసుక పంచాయితీ కొనసాగుతున్నది. అధికారులు, రైతుల మధ్య వాగ్వాదంతో పెద్దవాగు అట్టుడుకుతున్నది. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులకు ప్రభు త్వ పనుల పేరిట అక్రమంగా ఇసుకను తరలిస్తే భవిష్యత్తులో తమకు సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతాయని గ్రామస్థులు కొద్దిరోజులుగా కంటిమీద కునుకు లేకుండా వాగువద్ద కాపలా కాస్తున్నారు. గ్రామ శివారులోని పెద్దవాగు నుంచి మక్తల్ మండలం కాచ్వార్ సమీపంలో కొనసాగుతున్న సిమెం ట్ పైపుల తయారీకి రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇసుకను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు వారిని నిలువరిస్తున్నారు.
ఈ క్రమంలో వారం క్రితం నారాయణపేట ఆర్డీవో రాంచందర్, మక్తల్ సీఐ రాంలాల్ రాఘవ కంపెనీ ప్రతినిధులు, స్థానికులతో మాగనూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెండ్రోజుల పాటు చర్చలు కొనసాగించారు. పెద్దవాగు నుంచి పిడికెడు ఇసుకను తరలించినా ఊరుకోబోమని గ్రామస్థులు హెచ్చరించారు. అయినా వారి మాటలు పట్టించుకోని రాఘ వ కంపెనీ ప్రతినిధులు అధికార బలంతో పెద్దవాగులో ప్రభుత్వ అనుమతులు లేకుండానే రోడ్డు మార్గం ఏర్పాటు చేసుకున్నది. శనివారం రాఘవ కన్స్ట్రక్షన్ సిబ్బంది వాగులో టిప్పర్లను లోడ్ చేయగా గ్రామస్థు లు అడ్డుకున్నారు. తహసీల్దార్ నాగలక్ష్మి, డీటీ సురేశ్, ఎస్సై అశోక్బాబు వచ్చి ఇసుక రవాణాకు అడ్డుపడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వ నిబంధనల మేరకే వాగు నుంచి ఇసుకను తరలించేందుకు అనుమతిస్తున్నామంటూ వాహనాల ముందు నిలబడి ఫొటోలు దిగారు. అనంత రం అధికారులు, పోలీసులు దగ్గరుండి ఇసు క టిప్పర్లను బయటికి తరలించారు. విష యం తెలుసుకున్న గ్రామస్థులు, రైతులు పెద్దసంఖ్యలో వాగు వద్దకు వచ్చి వాహనాలను అడ్డుకున్నారు. ఇసుకను తరలిస్తే తమ శవాలను చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇసుక టిప్పర్లను ఖాళీ చేసి తిప్పి పంపించారు. రైతుల ఆవేదనను పట్టించుకోకుండా అధికారులు కాసులకు కకుర్తిపడి బడా కాంట్రాక్టర్లకు సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. టిప్పర్ లోడ్ చేసే సమయం లో ఓ పక రైతులు నిరసన వ్యక్తం చేస్తుండగానే స్థానిక రైతులు, రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.
ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో అధికారులు, కంపెనీ సిబ్బంది టిప్పర్లను వాగులో నుంచి బయటికి పంపించారు. తమను కాదని ఇసుక ఎలా తరలిస్తారో చూస్తామంటూ గ్రామస్థులు పోలీస్, రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు. అనంతరం మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమావేశం ఏర్పాటుచేసి పోలీసులు, రెవెన్యూ శాఖ దౌర్జన్యంపై చర్చించుకున్నారు. ఇసుక తరలించే విషయంపై స్థానిక మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లి రవాణా కాకుండా చూడాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.