Vakiti Srihari | అమరచింత, జనవరి 16: వనపర్తి జిల్లా ఆత్మకూరులో మంతి శ్రీహరికి నిరసన సెగ తగిలింది. గురువారం పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన అనంతరం మంత్రి ప్రసంగిస్తుండగానే.. మహిళలు అడ్డుతగిలారు. ఎన్నికలకు ముందు ఆత్మకూర్‌లో వందల కోట్ల అభివృద్ధి పనులు చేస్తానని హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. తాగునీరు, ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని అధికారులకు విన్నవించినా పట్టింపు కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు.
మంత్రి మాట్లాడుతూ రెండు వారాల్లో మున్సిపల్ ఎన్నికలు వస్తాయని, కాంగ్రెస్ అభ్యర్థిని కౌన్సిలర్‌గా గెలిపిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని నచ్చజెప్పారు. మంత్రి శ్రీహరిని సమస్యలపై తాము నిలదీయలేదని, ఇబ్బందులు విన్నవించామంటూ మహిళలు మాట్లాడిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరలైంది. త్వరలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రిని నిలదీశారని తెలిస్తే కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులపై ప్రభావం చూపుతుందని, అందుకే కొందరు సానుభూతిపరులు స్థానిక మహిళలకు నచ్చజెప్పి ఇలా మాట్లాడించి ఎస్ఎంలో పోస్టు చేశారన్న ప్రచారం జోరందుకున్నది.