హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులకు అన్నివిధాలా లబ్ధి చేకూరుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సచివాలయంలో పలువురు బిషప్లు, చర్చి ఫాదర్లు, క్రైస్తవ మత పెద్దలతో మంత్రి బుధవారం సమావేశమయ్యారు. మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉమ్మడి జిల్లాకు రెండు చొప్పున కేటాయించాలని, ప్రభుత్వ కార్పొరేషన్ పదవుల్లో క్రైస్తవులకు అవకాశం కల్పించాలని క్రిస్టియన్ మైనార్టీ పెద్దలు మంత్రిని కోరారు. మణిపూర్లో క్రైస్తవులపై దాడులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు అనుమతించాలని విన్నవించారు. క్రిస్టియన్ భవన్ నిర్మించడంతోపాటు, శ్మశానవాటికల నిర్మాణం కోసం ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలిచ్చిందని మంత్రి చెప్పారు. తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు.