హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో మరో భారీ కుంభకోణానికి తెరలేచింది. ఎల్ నినో కరువును అదునుగా చూపి ప్రాజెక్టుల్లో భారీ దోపిడీకి ప్లాన్ సిద్ధమైంది. ఈ ప్రణాళికలో భాగంగా ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని దశలవారీగా పెంచాలని రేవంత్‌రెడ్డి క్యాబినెట్ సూచన ప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, దేవాదుల, పాలమూరు-రంగారెడ్డి, నారాయణపేట- కొడంగల్, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు దాదాపు రూ.35 వేల కోట్ల అంచనా వ్యయం పెంపునకు క్యాబినెట్ ఆమోదించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఒక్క ఇటుక పేర్చకుండా, తట్టెడు మట్టి ఎత్తకుండా ఒక కలం పోటుతో రూ.35 వేల కోట్లకు టెండర్ వేసినట్టు సమాచారం. దీని నుంచి మీడియా, ప్రతిపక్షాల దృష్టి మళ్లించడానికే ప్రభుత్వం ధరణి పోర్టల్ మీద సెట్ (స్పెషల్ ఎంక్వైరీ టీమ్)ను తెరమీదికి తెచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో ఒక కొత్త ప్రాజెక్టునూ చేపట్టకుండా.. ఉన్న ప్రాజెక్టులనే గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు అకస్మాత్తుగా అంచనాల పెంపుపై చూపిస్తున్న ఆసక్తి వెనుక అసలు కథ ఏమిటన్నది చర్చనీయాంశమైంది. పెరిగిన ధరలు, జీఎస్టీ భారం, డిజైన్ మార్పులు అంటూ కారణాలు చూపిస్తున్నా, ఇంత భారీ స్థాయిలో అంచనాలు ఎగబాకడం వెనుక పకడ్బందీ సెచ్ ఉన్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనులు కాంట్రాక్టర్లకు అప్పగించి, కమీషన్ల వసూలుకు వేసిన పథకంలో భాగమే ఈ అంచనాల పెంపు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నాలుగు ప్రాజెక్టులే టార్గెట్
సీఎం రేవంత్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో 5 పాజెక్టుల అంచనాల పెంపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలిసింది. అదే సమావేశంలో ధరణి పోర్టల్‌పై సెట్ ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. నీటిపారుదల శాఖ నివేదిక ప్రకారం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదించిన వ్యయ అంచనాలతో పోలిస్తే దాదాపు రూ.1,26,960 కోట్ల మేర అదనపు వ్యయాన్ని ప్రతిపాదించినట్టు తెలిసింది. అన్ని ప్రాజెక్టులకు ఏకకాలంలో ఆమోదం తెలిపితే ప్రతిపక్షాలు, మీడియా నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ప్రస్తుతానికి నాలుగు ప్రాజెక్టుల అంచనాల పెంపునకు మాత్రమే ఆమోదం తెలిపినట్టు తెలిసింది. సవరించిన అంచనాల్లో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, దేవాదుల, పాలమూరు-రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ ప్రధాన ప్రాజెక్టులకు రూ.35 వేల కోట్ల వ్యయం పెంచినట్టు తెలిసింది. వీటితో పాటు గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలోని 180 పనుల ప్రీ క్లోజర్‌ను గత క్యాబినెట్ ఆమోదించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో సుమారు 3.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో చేపట్టిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రారంభంలో రూ.13,058 కోట్లు. దీన్ని ప్రభుత్వం ఏకంగా 48 శాతం పెంచి రూ.19,325 కోట్లకు సవరించింది.
అంతుదొరకని అంచనాలు
కరువు పీడిత మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో సుమారు 12.3 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో 2015లో రూ.35,250 కోట్లతో మొదలైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం ఇప్పటికే రూ.55,086 కోట్లకు చేరింది. తాజాగా నీటిపారుదల శాఖ లెకల ప్రకారం, మిగిలిన పనులు పూర్తి చేయడానికి మరో రూ.40,600 కోట్లు అవసరమని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ‘నమస్తే తెలంగాణ’కు అందిన పక్కా ఆధారాల ప్రకారం కేవలం నాలుగు ప్యాకేజీలకే రూ.2,351 కోట్ల అంచనా వ్యయాన్ని పెంచుతూ క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నిధులు ప్యాకేజీ 6, 11,15,17కు వర్తిస్తాయి. అన్ని ప్యాకేజీలకు కలిపి ఇంకా ఎంత పెంచారో ఈ లెక్కను బట్టి అంచనా వేసుకోవచ్చు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.4,725 కోట్లకు చేరింది. ఇందులో కేవలం భూసేకరణ కోసమే సుమారు రూ.1,197.61 కోట్లు కేటాయించడం గమనార్హం. ఎస్సెల్బీసీ అంచనా వ్యయాన్ని రూ.4,500 కోట్ల నుంచి రూ.6,000 కోట్లకు సవరించారు. దీన్ని మళ్లీ రూ.12 వేల కోట్లకు అంచనా పెంచాలని నిర్ణయించినట్టు తెలిసింది.
సన్నాయి నొకుల మర్మం ఏమిటో!
ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణ, పర్యావరణ అనుమతులు, కోర్టు కేసులు, ధరల పెరుగుదల, డిజైన్ మార్పులు వంటి అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్టు అధికారుల మాటలను బట్టి తెలుస్తున్నది. ఇప్పటికే ప్రారంభమైన ప్రధాన పథకాలను పూర్తి చేయడమే లక్ష్యమని సన్నాయి నొకులు వినిపిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఒక పని కూడా ముందుకు సాగకుండా, కేవలం కాగితాలపై అంచనాలు పెంచడం వెనుక ఉద్దేశం ఏమిటన్నది అసలు ప్రశ్న. ఇప్పుడు ఎట్లాగూ కరువు ఉన్నది కాబట్టి, ఈ కరువును సాకుగా చేసుకొని ప్రాజెక్టుల మీద అంచనాలు పెంచారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ఒక కొత్త సాగునీటి ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా చేపట్టలేదన్న విమర్శలు ఉన్నాయి.
ఉన్న ప్రాజెక్టులను సైతం ముందుకు తీసుకెళ్లకుండా పెండింగ్‌లో పెట్టిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో, అకస్మాత్తుగా అంచనాల పెంపుపై చూపిన వేగం అనుమానాలకు తావిస్తున్నది. క్యాబినెట్ భేటీలో ఏకకాలంలో ధరణిపై సెట్ వేయడం, మరోవైపు భారీ అంచనాల పెంపునకు ఆమోదం తెలుపడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వ అవినీతిని ఎండగడుతానంటూనే, తానే కొత్త అవినీతి బాటలో అడుగులు వేయడం వెనుక ప్రభుత్వ ఎత్తుగడ ఉన్నదని సమాచారం. అంచనాల పెంపు వెనుక వాస్తవ కారణాలు ధరల పెరుగుదలేనా?, లేక కొత్త కమీషన్ల దందాకు తెరతీసేందుకా? అనేది తేలాలంటే, ప్రతి ప్యాకేజీకి సంబంధించిన లెకలను బహిరంగంగా వెల్లడించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.