హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): దేవాలయ పరిపాలనలో నైపుణ్యాభివృద్ధి, ఆధునిక నిర్వహణ విధానాల అమలుకు ఉద్దేశించిన స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్స్(ఎస్ఐటీఏ-సీత) శిక్షణలో తెలంగాణ దేవాదాయశాఖ దేశంలోనే ఉన్నతస్థానంలో నిలుస్తుందన్న నమ్మకముందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండాసురేఖ అన్నారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని ప్రధాన కార్యాలయంలో శనివారం రాష్ట్ర దేవాలయ పాలనాసంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. సీతతో దేవాదాయశాఖలో కొత్త ఒరవడి ప్రారంభమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
సీత ఏర్పాటుతో ఆలయాల నిర్వహణ సక్రమంగా జరుగుతుందని ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్ అన్నారు. మూడురోజుల్లో సంస్కృతి-ఆగమశాస్ర్తాలపై ధార్మికభవన్తో పాటు భద్రాచలం, వేములవాడ, యాదగిరిగుట్టలో శిక్షణ కార్యక్రమాలుంటాయని డైరెక్టర్ ఎం హనుమంతరావు చెప్పారు. అనంతరం 18 మంది ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్వీస్ కింద సీనియర్ అసిస్టెంట్లుగా, మరో 20 మంది గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2 ఈవోలుగా ఉద్యోగోన్నతులు అందుకున్నారు. కార్యక్రమంలో ధార్మిక సలహాదారు గోవిందహరి, సీత డైరెక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు, అడిషల్ కమిషనర్లు శ్రీనివాసరావు, కృష్ణవేణి, ఆర్జేసీ రామకృష్ణారావు, డీసీలు వినోద్‌రెడ్డి, కృష్ణప్రసాద్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు బసవరాజు శ్రీనివాస్, వైస్‌చైర్మన్ సుబ్రహ్మణ్యప్రసాద్, తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ పాల్గొన్నారు.