హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్‌శాఖలో పలువురికి ప్రమోషన్లు కల్పించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లా పంచాయతీ ఆఫీసు (పీడీవో)ల్లో పనిచేస్తున్న 22మంది జూనియర్ అసిస్టెంట్లు/టైపిస్టులకు సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించారు. ఈ మేరకు పంచాయతీరాజ్, రూరల్ ఎంప్లాయిమెంట్శాఖ డైరెక్టర్ సృజన ప్రొసీడింగ్స్ జారీచేశారు.
ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాల నుంచి సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్న డీపీవో, డీఎల్పీవో కార్యాలయాలకు 22మందిని పదోన్నతితో బదిలీ చేశారు. అలాగే, రాష్ట్రంలోని వివిధ జిల్లా పరిషత్ (జెడ్పీ) కార్యాలయాల్లో పనిచేస్తున్న సూపరింటెండెంట్లకు కూడా ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
జెడ్పీల్లో 30 నుంచి 40మంది సూపరింటెండెంట్లు ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారని, అర్హత ప్రకారం వారికి కూడా ఉద్యోగోన్నతి కల్పించాల్సి ఉన్నదని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. పీఆర్ అధికారులు పంపించిన ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.