హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): నాన్ గెజిటెడ్ టీచర్ పోస్టులపై మాత్రమే కోర్టు స్టే ఉందని, గెజిటెడ్ పర్యవేక్షణధికారుల ఖాళీల్లో క్యాడర్ స్ట్రెంథ్ ప్రకారం టీచర్లకు పదోన్నతులివ్వాలని టీఎస్ యూటీఎఫ్ ప్రభుత్వాన్ని కోరింది. స్థానిక సంస్థల టీచర్లంటూ ఎవరులేరని, అంతా పాఠశాల విద్యాశాఖ నియంత్రణలోకి వచ్చారని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కే జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాన్ గెజిటెడ్ టీచర్ పోస్టులను ఏకీకృత జిల్లా క్యాడర్‌గా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశంపై మాత్రమే హైకోర్టు స్టే కొనసాగుతున్నదని గుర్తుచేశారు. రెండు దశాబ్దాలుగా పర్యవేక్షక పోస్టులు భర్తీకాక సంక్షోభం నెలకొన్నదని, ప్రభుత్వం చొరవ తీసుకుని, వెంటనే ఉప విద్యాధికారులు, ఎంఈవో, డైట్, బీఈడీ కళాశాల అధ్యాపక పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీచేయాలని ప్రభుత్వాన్ని కోరారు.