హైదరాబాద్, జనవరి 19(నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులకు సులభంగా మెరుగైన వైద్యసేవలు అందించే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేస్తామన్న జెరియాట్రిక్ క్లినిక్‌లు ఏడాది గడిచినా పట్టాలెక్కడం లేదు. జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 33 మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు గతంలో ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో ఓపీ, ఐపీ సేవలు అందిస్తామని ప్రకటించింది. ఇన్‌పేషెంట్ల కోసం 30వరకు బెడ్లు ఏర్పాటు చేసి ఆర్థో, సైకలాజికల్, ఈఎన్టీ, జనరల్ ట్రీట్మెంట్లకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నది. క్షేత్రస్థాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పల్లె దవాఖానల్లోని సిబ్బంది, ఆశలు, ఏఎన్ఎంల ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రత్యేక క్యాంపుల ద్వారా వృద్ధులను గుర్తించి జిల్లాస్థాయిలోని జెరియాట్రిక్ క్లినిక్‌లను పంపాల్సి ఉంటుంది. వృద్ధుల ఆరోగ్య పరిస్థితులపై ప్రతి నెలా క్షేత్రస్థాయి సిబ్బంది ఆయా క్లినిక్‌లకు రిపోర్టులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో వృద్ధుల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపర్చాలని సర్కారు భావించింది. ఇక ఈ క్లినిక్‌లకు నిమ్స్‌ను నోడల్ కేంద్రంగా పనిచేస్తుందని గతంలో ప్రకటించగా.. ఈ ఆసుపత్రిలో ఒక వార్డును జెరియాట్రిక్ క్లినిక్‌కు కేటాయించి సర్కారు చేతులు దులుపుకొన్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలో చాలామంది వృద్ధులను పిల్లలు పట్టించుకోకపోవడం, ఆరోగ్యంపై అశ్రద్ధ వహించడంతో వారు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో కుంగుబాటుకు లోనవుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న జెరియాట్రిక్ క్లినిక్‌తో తమకు కొంతైనా సాంత్వన దక్కుతుందని వీరంతా భావించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సైతం అనేక సందర్భాల్లో పీడియాట్రిక్ విభాగంలో చిన్నారులకు అందినంత పకడ్బందీగా వృద్ధులకు సైతం వైద్య సేవలు అందాలని అధికారులను ఆదేశించారు. జపాన్, ఇటలీ లాంటి దేశాల్లో వృద్ధులకు స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయని, మనదేశంలో కూడా అలాంటి వ్యవస్థ రావాలని ఆకాంక్షించారు. కానీ మంత్రి మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.