Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ): వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పెంపునకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. ఇందుకోసం విరమణకు దగ్గరగా ఉన్న ప్రొఫెసర్లు ప్రభుత్వంలో భారీ ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో శుక్రవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ అంశంపై ఆయా యూనివర్సిటీల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. శుక్రవారం వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన పలువురు కీలక ఉద్యోగులు పదవీ విరమణ పొందనున్నారు. దీంతో ఈలోపే వయసు పెంపు ఉత్తర్వులు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
ఈ మేరకు ఫైలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చేరినట్టు తెలిసింది. ఒకేరోజు సమయం ఉండటంతో సీఎం ఆమోదం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం వ్యవసాయ శాఖ కీలక అధికారి ఒకరు సీఎం రేవంత్రెడ్డి అపాయింట్మెంట్ కోరినట్టు తెలిసింది. అయితే ఇప్పటి వరకు అపాయింట్మెంట్ మాత్రం దొరకలేదు. ఒకవేళ ఏమైనా సమస్య తలెత్తితే, పాత తేదీతో ఉత్తర్వులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి కొందరు వ్యక్తులు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎవరెవరైతే విరమణకు దగ్గరగా ఉన్నారో వారందరి నుంచి ఆ నగదు వసూలు చేస్తున్నట్టు యూనివర్సిటీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. పెద్ద మొత్తంలోనే చేతులు మారుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే సంప్రదాయ యూనివర్సిటీలైన ఓయూ, కేయూ ఇతర వర్సిటీల్లో ప్రొఫెసర్ల వయసును ప్రభుత్వం 60 నుంచి 65 ఏండ్లకు పెంచింది. ఉద్యాన, వ్యవసాయ, వెటర్నరీ యూనివర్సిటీలు సాంకేతిక వర్సిటీలనే కారణంతో వీటిని పక్కకు పెట్టింది. అయితే ఈ మూడు యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు తమకు కూడా పెంచాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆ మూడు యూనివర్సిటీల ప్రొఫెసర్లు ఒకే వేదికపైకి వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.
ఉద్యోగ విరమణ వయసు పెంపును ఉద్యాన, వ్యవసాయ, వెటర్నరీ యూనివర్సిటీల్లోని అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరితోపాటు నిరుద్యోగ యువత కూడా వ్యతిరేకిస్తున్నది. మళ్లీ వయసు పెంచితే వాళ్లంతా ఇక్కడే తిష్ట వేస్తారని, తమకు ప్రమోషన్లు రావని వారంతా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మళ్లీ లాబీయింగ్ చేసుకొని హైదరాబాద్లోని కీలక పోస్టుల్లోనే తిష్ట వేసి, బదిలీలు లేకుండా చెలాయిస్తారని అంటున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.