హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : సంస్కరణల దిశగా పయనిస్తున్న జేఎన్టీయూహెచ్ మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. కోర్సుల బోధనకు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల్లో వీరి సేవలను అందిపుచ్చుకోవాలని భావిస్తున్నది. రెగ్యులర్ ప్రొఫెసర్ల స్థానంలో ఐటీ ఇంజినీరింగ్, పారిశ్రామిక, వైమానిక, వైద్య, ఫార్మా రంగాలకు చెందిన విషయ నిపుణులు వర్సిటీల్లోని విద్యార్థులకు పాఠాలు బోధించడానికి ఇటీవలే యూజీసీ అవకాశం కల్పించింది. వీరిని ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్‌గా యూజీసీ పేర్కొన్నది. పీహెచ్డీ అర్హతలతో నిమిత్తం లేకుండానే వీరిని నియమించుకోవచ్చని సూచించింది. ఆయా కాలేజీల్లో మంజూరైన పోస్టుల్లో 10 శాతానికి మించకుండా, సంబంధిత రంగాల్లో 15 ఏండ్ల అనుభవం ఉన్న వారిని ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్‌గా తీసుకోవచ్చని తెలిపింది.
ఈ నేపథ్యంలో జేఎన్టీయూ అధికారులు వీరి సేవలను వినియోగించుకోవడంపై కసరత్తు ముమ్మరం చేశారు. ఇటీవలి కాలంలో జేఎన్టీయూలో పెద్ద ఎత్తున కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డాటాసైన్స్, రోబోటిక్స్ వంటి కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. ఈ కోర్సులను బోధించేందుకు అధ్యాపకులు అందుబాటులో లేరు. గతంలో ఈ కోర్సులను చదివిన వారు లేకపోవడంతో పలు కాలేజీల్లో అధ్యాపకుల కొరత సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఈ కోర్సుల బోధనకు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ సేవలను వినియోగించుకోవాలని జేఎన్టీయూ నిర్ణయించింది. ఇందులో భాగంగా పరిశ్రమ వర్గాలతో చర్చలు మొదలుపెట్టింది. ఈ చర్చలు ముగిశాక ఔత్సాహికులైన వారి సేవలను వినియోగించుకొంటామని జేఎన్టీయూ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు.