హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): బీసీ కులగణన సంపూర్ణంగా జరగలేదని, అసంబద్ధంగా ఉన్నందున రీ సర్వే చేయాలని నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ కన్వీనర్, రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీమనోహర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉన్నదా? లేదా? అన్నది వేచి చూడాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నిర్వహించిన సర్వేపై రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాల ప్రతినిధులకే కాకుండా సాధారణ బీసీ ప్రజలకు సై తం అనేక అనుమానాలున్నాయని చెప్పారు. డాటా వెరిఫికేషన్ చేయకుండా బీసీల జనా భా ఇంత అని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించా రు. బీసీ కులగణనపై నిరసనలు, అనుమానా లు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే తెలంగాణ: కులగణన విషయంలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు, ప్రభుత్వ వాదనలపై మీరేమంటారు?
మురళీ మనోహర్: అనేక పోరాటాలు, చర్చపోపర్చల తరువాత ప్రభుత్వం కులగణన చేపట్టింది. దీన్ని స్వాగతిస్తున్నాం. సర్వే అనంతర పరిణామాలను చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. సర్వేలో మైగ్రెంట్స్‌ను కవర్ చేయలేదు. వలసపోయినవారు బోలెడంత మంది ఉన్నారు. వారిని సర్వే చేసే ప్రయత్నం చేయలేదు. ఈ ఎలక్ట్రానిక్ ప్రపంచంలో కనీసం ఒక యాప్ అయినా క్రియేట్ చేయలేకపోయింది. ఇండ్లు లేనివారిని, రోడ్లు పక్కన నివసించేవారిని కవర్ చేయలేదు. అన్నింటికన్నా ముఖ్యంగా అగ్రకుల జనాభా పెరిగిందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం జనాభా తగ్గిందని చెప్తున్నరు. అదెలా సాధ్యం? ఓసీ జనాభా పెరిగినప్పుడు బీసీలు ఎలా తగ్గుతారు. వారితో సమాంతరంగా వీళ్లూ (బీసీలు) పెరగాలి కదా? ఒక కమ్యూనిటీ పెరిగి, మరో కమ్యూనిటీ తగ్గడం అన్నది ఏ జనాభా సిద్ధాంతరీత్యా చూసినా సాధ్యం కాదు. కుటుంబాల సంఖ్య చివరి మూడేండ్లలో 1% పెరిగింది అన్నప్పుడు అందరూ పెరగాలి అలా పెరగలేదు.
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చిందని భావిస్తున్నారా?
ప్రభుత్వానికి అంత ఆత్రం దేనికి? కులగణన సర్వే నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీకి ఇవ్వడం, మీడియా సమావేశం పెట్టడం, ఆ వెంటనే మంత్రివర్గ సమావేశంలో ఆమోదించడం, వెనువెంటనే అసెంబ్లీలో ప్రకటించ డం.. ఈ మొత్తం ప్రక్రియను చూసినప్పుడు.. అనుమానాలు ఉండకుండా ఎందుకుంటాయి? కనీసం చదవొద్దా? డాటా అంటేనే వెరిఫికేషన్ ఉండాలి.
అసలు మీ అభ్యంతరం ఏమిటి? బీసీ జనాభా తగ్గినందుకా? ఇతరుల జనాభా పెరిగినందుకా?
మా అభ్యంతరం బీసీ జనాభా తగ్గినందుకో.. ఓసీల జనాభా పెరిగినందుకో అన్నది కాదు ప్రధానం. ఓసీ జనాభా పెరిగిందని మొత్తానికి జనాభాను తప్పు చూయించారు. గతంలో జరిగిన అనేక సర్వేలు, దశాబ్ది పెరుగుదల చూసినా ఒకరి జనాభా పెరిగితే, మరొకరి జనాభా అదే దామాషాలో పెరగాల్సిందే. సంచార జాతులను, మైగ్రేంట్స్ను సర్వే చేయలేదు. ప్రధానంగా ఇంతకుముందున్న అంటే 1931 కుల జనాభా గణాంకాల నుంచి అనేక కమిషన్లు సేకరించిన సమాచారం ముఖ్యంగా అనంతరామన్ కమిషన్, మురళీధర్‌రావు కమిషన్, ఇతర రాష్ట్రస్థాయి కమిషన్లు, మండల్ కమిషన్, ఎస్సీ కమిషన్లు, మైనార్టీ కమిషన్లు జాతీయ స్థాయిలో సేకరించిన సమాచారం, రాష్ట్రస్థాయిలో సమగ్ర కుటుం బ సర్వే-2014 లెకలు, లేబర్ సర్వేలు అన్నీ విడివిడిగా క్రోడీకరించి చూస్తే, బీసీ, ఎస్సీ, మైనార్టీల జనాభా తకువగా సూచించినట్టు స్పష్టంగా తెలుస్తున్నది.
సేకరణ దశ లేదా టాబ్యులేషన్ లేదా క్రోడీకరణ, విశ్లేషణ సందర్భంగా లోపాలు జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ఆయా సర్వేలు బీసీ, ఎస్సీ, మైనార్టీల జనాభా లెకల నిష్పత్తితో చూస్తే బీసీల జనాభా శాతం పెరిగినట్టు తెలుస్తున్నది. దశాబ్ది గ్రోత్ రేట్ అంచనాల ప్రకారం కనీసం 1% పెరుగుదల సూచించినా బీసీ జనాభా సంఖ్య ఎకువగా ఉండే అవకాశమే ఉన్నది.
సర్వేను తిరిగి చేయాలనా మీ ఉద్దేశం?
అసమగ్రంగా, అసంపూర్తిగా జరిగినట్టు ఆధారాలున్నాయి. తిరిగి మొత్తం చేస్త్తరా? కవర్కానివారిని చేస్తరా? అన్నది ప్రభుత్వానికి సంబంధించినది. తప్పుల్లేకుండా, అనుమానాలకు తావివ్వకుండా సమాజంలో ‘ఉన్నది ఉన్నట్టు’గా సర్వే ప్రతిఫలించేలా ఉండాలి. అలా ప్రతిఫలించాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది.
బీసీల పట్ల తమకు ఉన్న చిత్తశుద్ధికి వేగిరం నిదర్శనమన్నట్టుగా ప్రభుత్వం చెప్తున్నది కదా?
సర్వేను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. కులాలవారీగా జన సంఖ్య ఇవ్వాలి. అలా ఏమీ చేయకుండా ఆదరాబాదరగా ‘చేశాం అన్నట్టుగా చేయడంపైనే’ ప్రభుత్వం దృష్టిసారించింది కానీ, అందులో చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించడం లేదు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పినం. అశాస్త్రీయంగా చేశారని ఆధారాలతో చెప్పినం. ఈ మొత్తం ప్రక్రియలో ఇన్ని తప్పులు జరిగాయి. వీటిని ఎట్లా సవరిస్తారు? అని అడిగినం. కవర్‌కానీ వాళ్లను కవర్ చేయాలి. అందుకే రీ సర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నం. స్పెషల్‌డ్రైవ్ చేయాలని, అవసరమైతే ఒక ‘యాప్’ క్రియేట్ చేయాలని సూచించాం. తప్పకుండా చేస్త్తమన్నరు. కానీ, చేస్తరు అని నేను అనుకోవడం లేదు. చేస్తరా? చేయరా? అనేది వేచి చూడాలి.
ప్రభుత్వానికి మీవైపు నుంచి సూచన ఇంకేదైనా ఉన్నదా?
సాధారణంగా ఇలాంటి సర్వే నిర్వహించినప్పుడు ఎకడైనా నిపుణులతో డా టాను వెరిఫై చేయించడం, అవసరమైన చోట, అనుమానం ఉన్నచోట రీటెస్ట్ చే యించడం లాంటివి ఇకడ జరగలేదు. డాటా వాలిడేషన్, డాటా వెరిఫికేషన్ చేయాలి. శాంపిల్ రీ టెస్టింగ్ చేయాలి. కానీ ప్రభుత్వం చేయలేదు. ఎక్స్పర్ట్ బాడీని వేయమని చెప్పినం. ఆ డెడికేటెడ్ కమిషన్ కూడా ఎక్స్పర్ట్ బాడీని వేయాలి. అది అసలు పనిచేస్తున్నదా? లేదా అనేది ఎవరికీ తెలియదు. ఆ కమిషన్ రిపోర్ట్ సమర్పించిన తరువాత రిజర్వేషన్లు చేయాలి.
ఇంటింటి సర్వేలో మిగిలిపోయినవారి, ఇండ్లు లేని రోడ్డు పకన, చెట్ల కింద, నిర్మాణ పనుల ఆశ్రమాల్లో ఉన్న వారిని, వలస వెళ్లినవారిని సర్వేలో భాగస్వామ్యం చేయాలి. ఒక యాప్‌ను రూ పొందించాలి. పంచాయతీ, వార్డు ఆఫీస్ సహా అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఉ న్న సమాచారం సేకరించలేదు. సర్వే సక్రమంగా జరగకపోవడంతోనే బీసీల సంఖ్య పడిపోయినట్టు భావించాల్సి వస్తుంది. వీటిని సవరించుకోవాలి.