ఖైరతాబాద్, మే 31 : డిగ్రీ విద్యలో భాషా విధానాన్ని కొనసాగించాలని ప్రొఫెసర్ హరగోపాల్ కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో కవి, రచయిత నందిని సిధారెడ్డితో కలిసి మాట్లాడారు. యూజీసీ సూచనల మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి డిగ్రీ తృతీయ సంవత్సరంలో భాషను తొలగించాలనుకోవడం సరికాదని పేర్కొన్నారు. అంతేకాకుండా 150 క్రెడిట్స్(తరగతులు) నుంచి 125కు కుదించారని, ఫలితంగా విద్యార్థులపై ప్రభావం పడుతుందని వాపోయారు. సమావేశంలో పాలమూరు అధ్యయన వేదిక ప్రతినిధి రాఘవచార్యులు, సిటీ కళాశాల తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నీరజ, ఆంగ్ల విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ ఆది రమేశ్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణ పాల్గొన్నారు.
‘ఎంబీబీఎస్-ఆయుర్వేద’ కోర్సుపై వివాదం ; ఆధునిక వైద్యం, ఆయుర్వేదను మిక్స్ చేయడంపై డాక్టర్ల అభ్యంతరం
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్, బీఏఎంఎస్ ఇంటిగ్రేటెడ్ కోర్సును ప్రవేశపెట్టాలని భావిస్తున్న కేంద్రం పుదుచ్చేరిలోని జిప్మర్లో కోర్సును ప్రవేశపెట్టనున్నట్టు ఇటీవల ప్రకటించింది. ఈ అంశంపై జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రెండు వేర్వేరు వైద్య విధానాలను కలిపి కోర్సుగా అందించాలనే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అశాస్త్రీయమైనదని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఐఎంఏ, టీ-జూడా డిమాండ్ చేశాయి. చైనాలో ఆధునిక వైద్యం, సంప్రదాయ వైద్యాన్ని కలిపి అందించాలని చూశారని, అక్కడ విఫలమైందని టీజుడా రాష్ట్ర అధ్యక్షుడు ఇసాక్ న్యూటన్ తెలిపారు.