Professor Haragopal | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా విశ్వవిద్యాలయంపై నిర్బంధం ఏ ప్రజాపాలనకు మార్గం అంటూ పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉస్మానియా రిజిస్ట్రార్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హరగోపాల్‌తోపాటు హక్కుల నేతలు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, ఎం రాఘవచారి, కే రవిచందర్ బుధవారం ప్రకటనలో వీసీ తీరును ఖండించారు.
విశ్వవిద్యాలయాలు పోరాడకుండానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందా? అని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు సరికొత్త ఆలోచనలతో ప్రపంచ ప్రగతికి ఎంతగా దోహదం చేస్తున్నాయో.. అలాగే ప్రగతి నిరోధక విధానాలను నిలువరించడానికి కూడా ప్రశ్నలను, చర్చలను, ఉద్యమాలను ముందుకు తీసుకువస్తున్నాయని గుర్తుచేశారు.
ఇటీవల ఓయూ రిజిస్ట్రార్ విద్యార్థుల స్వేచ్ఛను హరించేలా ఉత్తర్వులు విడుదల చేశారని మండిపడ్డారు. ప్రజాపాలనను అపహాస్యం చేసే చర్యలకు వీసీ పాల్పడ్డాడంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబేద్కర్‌కు డాక్టరేట్ పట్టా ఇచ్చి గౌరవించిన ఓయూ తన చరిత్రను తానే చెరిపి వేసుకుంటూ అప్రజాస్వామిక ఉత్తుర్వులివ్వటం సరైన చర్య కాదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను అణిచివేసే, అక్రమ కేసులు పెట్టి వేధించే దారినే ఎంచుకుంటుందని విమర్శించారు. అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఉస్మానియాలో విధించిన నిర్బంధ ఉత్తర్వు రద్దు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఈ ఉత్తర్వును రద్దు చేయించాలని డిమాండ్ చేశారు.