హైదరాబాద్ సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ వ్యవసాయాన్ని అంధకారంలో నెడుతున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ మండిపడ్డారు. ‘ఫార్మాసిటీ భూముల్లో ఏం జరుగుతున్నది’? అనే అంశంపై హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటు సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలు, పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ పరిశ్రమల పేరిట రైతుల భూములను లాక్కొని నేలను కాలుష్య కోరల్లోకి నెడుతున్నారని మండిపడ్డారు.
రైతులు గ్రామాలను వదిలి, తమ సమస్యలను చెప్పుకోవడానికి హైదరాబాద్‌కు వచ్చి ఇలా సమావేశాలు నిర్వహించుకోవడం బాధాకరమని విచారం వ్యక్తంచేశారు. రైతుల భూముల రక్షణకు ఉమ్మడిగా పోరాటాలు చేయాలని, అందుకు పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో రైతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తుండటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఫార్మాసిటీ భూములను తిరిగిస్తామని నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణవేత్త బాబురావు, జస్టిస్ చంద్రకుమార్, సామాజిక కార్యకర్తలు కన్నెగంటి రవి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.