హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులకు ప్రాణ హాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరు పరచాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ అధ్యక్ష,కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నారాయణ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలోని ఓ గ్రామంలో నిన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మెంబర్ సుధాకర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ మైలారపు ఆడెళ్లు అలియాస్ భాస్కర్, బండి ప్రకాష్, నేషనల్ పార్క్ కార్యదర్శి దిలీప్, మద్దెడు ఏరియా కార్యదర్శి సీటు, రామన్న డీసీ మెంబర్, మున్నా, సునీత, మహేష్ లతో పాటు పది మంది మావోయిస్టు నాయకులను పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారని తెలిపారు.
నిన్న సుధాకర్‌ను ఎన్కౌంటర్ పేరున హత్య చేశారు. అలాగే ఈరోజు(శుక్రవారం) సాయంత్రం భాస్కర్‌ను కూడా ఎన్కౌంటర్ పేరున హత్య చేశారని ఆరోపించారు. ఇంకా పోలీసుల అదుపులో ఉన్న బండి ప్రకాష్, మిగతా మావోయిస్టు నాయకులను ఎన్కౌంటర్ పేరున హత్య చేసే ప్రమాదంద ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి ఎలాంటి హాని తల పెట్టకుండా వెంటనే కోర్టులో హాజరు పరచాలని పౌరహక్కుల సంఘం తెలంగాణ తరఫున డిమాండ్ చేశారు.
ప్రాణాలతో దొరికిన దొరికిన మావోయిస్టు నాయకులను ఎన్కౌంటర్ పేరుతో హతమార్చడం రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేకం అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, ప్రతిపక్ష పార్టీలు దీన్ని ముక్త కంఠంతో ఖండించాలన్నారు. మావోయిస్టు పార్టీ ప్రకటించినట్లుగా కేంద్ర ప్రభుత్వం కూడా కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.