హిమాయత్‌నగర్, సెప్టెంబర్30: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తూ ఆదివాసీలు, మావోయిస్టులను పొట్టన పెట్టుకుంటుందని తెలంగాణ పౌర హక్కుల సంఘం (సీఎల్సీ) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్ మండిపడ్డారు. మంగళవారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణరెడ్డి, కే రామచంద్రారెడ్డిలను ఈనెల 11న పోలీసులు చిత్ర హింసలు పెట్టి హత్యచేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 21నెలలుగా సుమారు 700మందిని బూటకపు ఎన్కౌంటర్ చేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వాల నియంతృత్వ పాలనకు ఈ బూటకపు ఎన్కౌంటర్లే నిదర్శనమని విమర్శించారు. ఇప్పటికైనా మావోయిస్టు ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం శాంతిచర్చలు జరపాలని డిమాండ్‌చేశారు.
సీపీఎస్ వద్దంటూ నేడు ‘ఎక్స్’ వార్ ; ఎన్‌ఎంవోపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఉద్యోగులంతా బుధవారం సీపీఎస్, యూపీఎస్ వద్దు.. పాత పింఛనే ము ద్దు అంటూ బుధవారం ఎక్స్ వార్‌ను తలపెట్టినట్టు నేషనల్ యూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్‌ఎంవోపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ ద్యోగుల పాలిట గుదిబండగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఉద్యోగులు సోషల్ మీడియా వార్‌కు సిద్ధమయ్యారని తెలిపారు. ప్రధాని, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి, రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఆర్థికశాఖ మంత్రులను ట్యాగ్చేస్తూ హ్యాష్‌టాగ్‌లతో తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తారని తెలిపారు. దీంతోపాటు టీచర్లు రెండేండ్లల్లో టెట్ పాస్ కావాలన్న సుప్రీంకోర్టు తీర్పుపైనా నిరసన వ్యక్తం చేస్తామని పేర్కొన్నారు. యూపీఎస్ స్కీం ఉద్యోగులను ఎం దుకు ఆకర్షించలేదో ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు.