హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): వైద్య సిబ్బంది రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలు అమలు కావడం లేదని వైద్యులు తేల్చి చెప్తున్నారు. అఖిల భారత ప్రభుత్వ వైద్య సంఘాల సమాఖ్య తరఫున హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాదల జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ప్రభుత్వం నియమించిన ‘రీవాపింగ్ వర్కింగ్ కండీషన్స్ ఆఫ్ హెల్త్ కేర్ పర్సనల్’ సబ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
దేశంలో వైద్యులు, సిబ్బందిపై జరుగుతున్న దాడులు, వాటిని అరికట్టే చట్టాలపై అవగాహన, చట్టాలు అమలవుతున్న తీరుపై ఆయన తాజాగా దేశవ్యాప్త సర్వే నిర్వహించారు. ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఇందులో 22 రాష్ట్రాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నట్టు ఆయన తెలిపారు. సర్వే ఫలితాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్ కన్వీనర్‌కు అందించినట్లు పేర్కొన్నారు.