e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home తెలంగాణ మానవతావాది ప్రేమమూర్తి

మానవతావాది ప్రేమమూర్తి

మానవతావాది ప్రేమమూర్తి

చరిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రాజసం ఉట్టిపడేలా ఉండే ఆర్ట్స్‌ కాలేజ్‌లోని సెల్లార్‌లో ఉండే డిపార్టుమెంట్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌లోకి ప్రవేశిస్తూనే ఎడమవైపు ఒక పెద్దగది ఉంటుంది. అందులో ఒత్తయిన జుట్టు, గుబురు మీసాలు, ప్రేమ కురిపించే పెద్దకండ్లతో, అతి సామాన్యంగా కనిపించే ప్రొఫెసర్‌ కూర్చుని ఉంటారు. మీరు ఆయన్ను చూసినా, ఆయన మిమ్మల్ని చూసినా ఆయనే కుర్చీలోంచి లేచి నిలబడి నగుమోముతో ఒదిగిపోయి ప్రేమపూర్వకంగా పలకరిస్తారు.
మీరు అక్కడి పూర్వవిద్యార్థి కావచ్చు, ఆ ఏడాదే చేరిన పిల్ల విద్యార్థి కావచ్చు లేదా డిపార్ట్‌మెంట్‌కు విజిటర్‌ కావచ్చు. మీరెవరైనా సరే అయన పలకరింపులో, ప్రేమలో కించిత్‌ మార్పు అయినా ఉండదు. మీకు ఏ సమస్య, సందేహం ఉన్నా, తన పని మానుకొని వచ్చి మీకు అయన సహకరిస్తారు. పూర్తిగా, మనస్ఫూర్తిగా. కుల, మత, ప్రాంత, సిద్ధాంతాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా విసుగు, విరామం లేకుండా.. డాంబికం, పటాటోపం లేకుండా నవ్వుతూ అయన అందించే స్నేహహస్తం ఎవ్వరికైనా మధురానుభూతినిస్తుంది.
మీకు కాస్త సమయం ఉండి ఆయన గదిలోకి వెళ్లి కూర్చుంటే, దేశ కాలమాన పరిస్థితులు (ఇది ఆయన ఊతపదం), వర్తమాన రాజకీయాలు, జర్నలిజం ధోరణులు, సాంఘిక సమస్యలు, దళిత బడుగు బలహీన వర్గాల స్థితిగతులు, తాడిత- పీడిత ప్రజల అగచాట్లు విశ్లేషించి తన అభిప్రాయాలు చెబుతారు. వాటిమీద మీ దృష్టికోణం ఏమిటని ప్రేమగా అడిగి తెలుసుకుంటారు. ఆయన సంభాషణ ఆసాంతం స్వచ్ఛమైన ప్రేమ, నిష్కల్మషమైన అమాయకత్వం, అద్భుతమైన విశ్లేషణా సామర్థ్యం, సమయానుకూల హాస్య చతురత కనిపిస్తాయి. మీరు నోరు తెరిచి అడిగితే సినీ, రాజకీయ ప్రముఖుల మాటను అనుకరిస్తారు. ఇంకా చనువుతో అడిగితే ‘సత్య హరిచంద్ర’లో కాటికాపరి సీన్‌ డైలాగ్‌ను లీనమై వినిపిస్తారు. మంచి మనిషి, మంచి కమ్యునికేటర్‌ అన్న మాటలకు ఆయన నిలువెత్తు నిదర్శనం అని మీకు అర్థమైపోతుంది.
ఆయనే ప్రొఫెసర్‌ బండి బాలస్వామి. ఈ మాటలన్నీ దురదృష్టవశాత్తు ఇప్పుడు చరిత్రలో భాగమయ్యాయి ఈ ముదనష్టపు కొవిడ్‌ కారణంగా. 1970 జూన్‌ 30న ఆంధ్రప్రదేశ్‌లోని పెదకూరపాడు మండలం అబ్బరాజుపాలెం గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి అడ్డంకులు, అవరోధాలు అధిగమించి జర్నలిజం ప్రొఫెసర్‌ స్థాయికి, అత్యంత ప్రభావశీలమైన ఆచార్యుని స్థాయికి ఎదిగిన బాలస్వామి సార్‌ 20 రోజులపాటు కరోనాతో పోరాడి శుక్రవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తన బాల్యమిత్రుడు, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ఉన్న కెనడీని అదే కరకు కరోనా కబళించిన మర్నాడే మరొక రెండు మూడు రోజుల్లో దవాఖాన నుంచి ఇంటికి వస్తారని భావించిన బాలస్వామి సార్‌ తరలిరాని తీరాలకు తరలిపోయారు. పరమ సాత్వికుడు, అత్యంత మృదుస్వభావి, ఇతరుల సమస్యే తన సమస్య అనుకునే బాలస్వామి సార్‌ కెనడీ సార్‌ మరణవార్తతో తల్లడిల్లి కుమిలిపోవడం వల్లనే ఈ హఠాన్మరణం జరిగిందేమోనని అనిపిస్తుంది.
కుటుంబ పోషణకోసం ఊర్లో పశువులు కాసి, కూలీకి వెళ్లిన బాలస్వామి 1991లో నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఏ చదివి అఖిల భారత పోటీ పరీక్షలో నెగ్గి ప్రఖ్యాత హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎం ఏ (కమ్యునికేషన్‌)లో స్థానం పొందారు. ఆ కోర్సులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులై అక్కడే పీహెచ్‌డీ చేశారు. ‘సమగ్రాభివృద్ధిలో కమ్యునికేషన్‌ పాత్ర: మెదక్‌ జిల్లా కేస్‌ స్టడీ’ అనే అంశంపై 2002లో డాక్టోరల్‌ డిగ్రీ పొందారు. గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన ఆయన 1993లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ పొందే దాకా తన చదువుకోసం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 1996లో అస్సాం యూనివర్సిటీలో లెక్చరర్‌ హోదాలో జర్నలిజం బోధించిన బాలస్వామి సార్‌ 2004లో ఉస్మానియాలో చేరి 2010లో ప్రొఫెసర్‌ అయ్యారు. సమగ్రాభివృద్ధిపై ఒక పుస్తకం ప్రచురించిన ఆయన అనేక పరిశోధనా పత్రాలు రాయడమే కాకుండా పలు పుస్తకాలకు చాఫ్టర్లు అందించారు. దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలకు సిలబస్‌ రూపకల్పనలో, పాఠాల రచనలో కీలకపాత్ర పోషించిన బాలస్వామి సార్‌ కమ్యునికేషన్‌ సిద్ధాంతాలు, ఎలక్ట్రానిక్‌ మీడియా, డెవలప్‌మెంట్‌ కమ్యునికేషన్‌ బోధించేవారు. వీడియో ఫిలింలు, సృజనాత్మక రచనలు ఆయనకెంతో ఇష్టం.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న రోజుల్లో పోరాటానికి కేంద్రబిందువు అయిన ఆర్ట్స్‌ కాలేజీలో పనిచేస్తున్న ఏ ఆచార్యుడైనా ఆంధ్రప్రదేశ్‌ మూలాలు కలిగి ఉండీ విద్యార్థుల ప్రేమాభిమానాలు చూరగొనడం చిన్న విషయం కాదు. అంతటి కఠిన కాలంలోనూ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ ఛైర్మన్‌గా ఆయన పోషించిన పాత్ర ప్రశంసనీయం. ఆవేశానికి లోనైన విద్యార్థులు అధ్యాపకుల పైకి భౌతికదాడికి తెగబడిన సందర్భంలో, వాగ్వాదానికి లేదా దూషణ పర్వానికి దిగిన సమయంలో బాలస్వామి సార్‌ ప్రాంతీయత రూపంలో తనకున్న ముప్పును సాకుగా చూపి తప్పించుకోలేదు. ఉద్రిక్తత పెచ్చరిల్లకుండా వ్యవహరించడంలో అయన ముందుండేవారు. అలాగే, హాస్టల్స్‌ వార్డెన్‌గా పనిచేసినపుడు సమస్యలను వేగంగా పరిష్కరించడంలో, విద్యార్థులకు- అధికారులకు మధ్య సఖ్యతను సాధించడంలో బాలస్వామి సార్‌ మంచితనం, మృదు స్వభావం బాగా పనిచేశాయి.
గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తనకు జీవితం ప్రసాదించిన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో కమ్యునికేషన్‌ విభాగంలో పిల్లలకు ప్రొఫెసర్‌గా ఎన్నో సేవలందించాలన్న కోరిక బాలస్వామి సార్‌కు బలీయంగా ఉండేది. అది సాకారం కాకపోవడానికి మూడు నాలుగు సందర్భాల్లో కారకులైన వ్యక్తుల గురించి, పరిస్థితుల గురించి సన్నిహితుల దగ్గర ఆవేదనతో ప్రస్తావించేవారు. వివాదాలు సృష్టించి వ్యవస్థను దెబ్బ తీయకుండా ఎవరి విజ్ఞతకు వారిని వదిలేయాలని ఆయన అనేవారు.
పెద్ద పెద్ద విశ్లేషణలతో మాటల గారడీ చేసే టిప్‌టాప్‌ మేధావుల రకం కాదు బాలస్వామి సార్‌. తక్కువగా మాట్లాడి, ఎక్కువ ప్రభావశీలంగా, సాధ్యమైనంత ఎక్కువమందికి సంపూర్ణ సహకారం అందించి వారి జీవితాల్లో ఆనందాన్ని నింపడం ఆయన సూత్రం. నీతి నిబద్ధతలతో వ్యవహరిస్తూ, ఇతరులకు వ్యతిరేకంగా పల్లెత్తు పరుష మాటైనా ఆడని బాలస్వామి సార్‌ తన ప్రేమపూర్వక ప్రవర్తన, సౌమ్యమైన మాటలు, చేతలతో తాను రూపొందించుకున్న జీవనసూత్రాన్ని చెప్పకనే చెప్పడం వల్లే.. పెద్ద సంఖ్యలో అభిమానులను పొందారు. అయన మరణవార్త విని వందలమంది విద్యార్థులు హతాశులయ్యారు. చెరగని చిరునవ్వుతో, సానుకూల ధోరణితో, మానవత్వమే పరమావధిగా మెలిగిన బాలస్వామి సార్‌ మరణం తీరని లోటు.

  • డాక్టర్‌ ఎస్‌.రాము (సీనియర్‌ జర్నలిస్టు, జర్నలిజం బోధకుడు)
  • పి.రత్నాకర్‌ (దూరదర్శన్‌ న్యూస్‌ విభాగం అధిపతి, ఆంధ్రప్రదేశ్‌)
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మానవతావాది ప్రేమమూర్తి

ట్రెండింగ్‌

Advertisement