నమ్మిన పాపానికి నట్టేట ముంచిన కాంగ్రెస్ సర్కార్‌పై అన్నదాతలు కన్నెర్రజేశారు. ఓవైపు ఎక్కడిధాన్యం అక్కడే పేరుకుపోయినా నెలాఖరు వరకే కొంటామని ప్రభుత్వం ప్రకటించడంపై మండిపడ్డారు. నెలన్నరైనా తూకం వేయకపోవడం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించకపోవడంతో కడుపు మండి సోమవారం అనేక జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం, అధికారుల తీరుపై రగిలిపోయి ధాన్యం బస్తాలు తగులబెట్టారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. అధికారులను బంధించి.. మార్కెట్ గేట్లు మూసి వేసి నిరసన తెలిపారు. నిర్మల్ జిల్లా కడెంలో ఓ రైతు ఆవేదనతో ఆర్ఐ కాళ్లపై పడి ధాన్యం కొనాలని దీనంగా వేడుకున్నాడు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 25: ధాన్యం కొనుగోలులో తాత్సారంపై రైతులు మండిపడుతున్నారు. నెలన్నర రోజులైనా తూకం పెట్టక పోవడంపై కన్నెర్ర చేస్తున్నారు. సర్కార్, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల తీరును నిరసిస్తూ సోమవారం అనేక జిల్లాల్లో రైతులు రోడ్లెక్కారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధాన్యం బస్తాలను తగులబెట్టారు. పురుగుల మందు డబ్బాలతో సుమారు 2 గంటలపాటు ఎండలో ఆందోళన చేపట్టారు. నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రంగరాయగూడెం గ్రామానికి చెందిన రైతు చిట్రెడ్డి నర్సింహారెడ్డి కొనుగోలు కేంద్రంలో తన ధాన్యానికి నిప్పుపెట్టి నిరసన తెలిపాడు.
ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన్ఎల్లాపూర్ చౌరస్తా వద్ద రైతులు ఆందోళనకు దిగారు. లింగాపూర్, సారంగాపూర్, మాసాయిపేట్ గ్రామాల రైతులు నచ్చన్ఎల్లాపూర్ చౌరస్తాలో నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై మండటెండలో బైఠాయించారు. ఈ క్రమంలో లింగాపూర్‌కు చెందిన రైతు ఆకుల నర్సయ్యస్పృహ కోల్పోయాడు. వెంటనే అతడిని ప్రైవేట్ వాహనంలో కడెం దవాఖానకు తరలించారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని కొందరు రైతులు అక్కడికి వచ్చిన ఆర్ఐ శారద కాళ్ల మీద పడి వేడుకున్నారు.
రేవంత్దిష్టిబొమ్మ దహనం
వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం ముంగాజిపల్లి ఎస్సీ కాలనీ రైతులు గజ్వేల్ – చేగుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనంచేశారు. వానకాలం సమీపిస్తున్నా ఇంకా ధాన్యం కొనుగోలు చేస్తలేరని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి రింగ్‌రోడ్డు వద్ద రైతులు ధర్నాకు దిగారు. రెండు రోజుల క్రితం గజ్వేల్‌లో ధర్నా చేస్తే కొనుగోళ్లను వేగవంతం చేస్తామన్న అధికారులు, ఎక్కడా కనిపించడం లేదని రైతులు మండిపడ్డారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రత్నాపూర్ గ్రామ రైతులు శివ్వంపేట సొసైటీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కాంటా పెట్టిన వడ్లను తరలించేందుకు లారీలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ శివ్వంపేటలోని సొసైటీ కార్యాలయం ఎదుట నర్సాపూర్-తూప్రాన్ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కిష్టంపేట వద్ద చెన్నూర్-మంచిర్యాల జాతీయ రహదారిపై రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. కిష్టంపేటలోని కొనుగోలు కేంద్రంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదంటూ మండిపడ్డారు. రెండు నెలలు గడుస్తున్నా ధాన్యం కొనడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. సారంపల్లిలోని సిరిసిల్ల – సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. గంటపాటు అక్కడే బైఠాయించడంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
మార్కెట్ మెయిన్‌గేటు మూసివేసి నిరసన
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌కు మక్కలు తెచ్చి ఇరువై రోజులైనా కొనడం లేదని రైతులు ప్రధాన గేటు వద్ద ఆందోళనకు దిగారు. గేటును మూసివేసి ఎవరినీ లోపలికి రాకుండా అడ్డుకున్నారు.హమాలీల సంఖ్యను పెంచి తూకం, లోడింగ్ వెంట వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్ అధికారి షాబుద్దీన్, మార్కెట్ కమిటీ కార్యదర్శి హమీద్ రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇరువై రోజులైనా కొనే దిక్కులేదు..
అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ఇరువైరోజులుగా పడిగాపులు కాస్తున్నామంటూ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం బిర్సాయిపేట్ రైతులు ధాన్యపు బస్తాలు రోడ్డుపై పెట్టి ధర్నా నిర్వహించారు. ఐటీడీఏ పీవో మంద మకరందు హామీతో రైతులు ధర్నా విరమించారు. పది రోజులుగా జొన్న నిల్వలు పేరుకుపోయాయంటూ ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం మేడిగూడ(ఆర్)లో జొన్న రైతులు ధర్నా నిర్వహించారు. మక్కజొన్న కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా బాసరలోని బాసర-భైంసా రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. మార్కెట్లో మక్కజొన్నను కొనుగోలు చేసినా.. గోదాముల్లో అన్లోడ్ చేయడం లేదంటూ నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ సమీపంలో జడ్చర్ల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ధాన్యం కొనుగోలులో ఆలస్యం చేస్తున్నారంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల ఫ్లై ఓవర్‌పై రైతులు బైఠాయించారు.
అకాల వర్షానికి తడిసిన ధాన్యం
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 25 : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో పోసిన వడ్లు, మక్కలు తడిసిపోయాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వడగండ్ల వానకు ధాన్యాన్ని కాపాడుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. హనుమకొండ ఎల్కతుర్తి ఐకేపీ కేంద్రంలోని ధాన్యం తడిసిపోయింది.
మేడం.. కనికరించండి!

వడ్లు కొనాలని వేడుకుంటూ నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ చౌరస్తాలో ఆర్ఐ శారద కాళ్లు మొక్కుతున్న రైతు
స్పృహ తప్పిన రైతన్న

నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్‌కు చెందిన రైతు ఆకుల నర్సయ్య స్పృహ కోల్పోవడంతో దవాఖానకు తరలిస్తున్న తోటి రైతులు
ఆగ్రహ జ్వాలలు

వడ్లను కొనకపోవడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం ముంగాజిపల్లిలో గజ్వేల్ – చేగుంట ప్రధాన రహదారిపై సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న రైతులు
ధాన్యం కొంటర కొనర?

ధాన్యం కొనుగోలు చేయాలంటూ నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామ సమీపంలో ఆందోళన చేస్తున్న రైతుల
ధర్మాగ్రహం

లారీల కొరతపై మెదక్ జిల్లా శివ్వంపేట సొసైటీ కార్యాలయం వద్ద సీఈవో మధును ప్రశ్నిస్తున్న రైతులు
మేడిగూడలో జొన్న రైతుల ధర్నా

జొన్నలు తరలించేందుకు లారీలు పంపాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని మేడిగూడలో ధర్నా చేస్తున్న రైతులు
ఎన్నాళ్లీ కష్టాలు

నెల రోజులుగా మక్కలు కొనుగోలు చేయడం లేదని కరీంనగర్ మార్కెట్ యార్డు గేటును మూసివేసి అక్కడే ఆందోళన చేస్తున్న మక్కజొన్న రైతులు

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేట మార్కెట్లో వర్షానికి తడిసిన ధాన్యాన్ని కుప్ప నూర్చుతున్న రైతులు