సిద్దిపేట : జిల్లాలోని చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు గోనపల్లి, ఇబ్రహీంనగర్ గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాలను ( Procure Grain ) మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ( Harish Rao ) సందర్శించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో కన్నీళ్లు పెట్టుకుం టున్న రైతులను కలిసి.. అధైర్యపడొద్దని, అండగా ఉండి కొట్లాడతామని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనకపోవడం వల్లే ఆరుగాలం పండించిన పంట తడిసి ముద్దయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తమ బాధ్యతలను విస్మరించి రైతులను మోసపుచ్చుతూ నాటకాలు ఆడుతున్నాయని దుయ్యబట్టారు. వడ్లు, మక్కలు, సన్ ఫ్లవర్, శనగలు, జొన్నలు కొనమంటే కాంగ్రెస్ నాయకులు కేంద్రం మీద నెపం నెడుతున్నారు.

మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ వాళ్లు వడ్లు కొనాలని ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ లెవీ కోటాను, ఎరువుల కోటాను రాష్ట్రానికి సకాలంలో ఇవ్వకుండా బీజేపీ మోసం చేస్తుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ రైతులను గాలికి వదిలేసి ఇద్దరూ కలిసి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని విమర్శించారు.గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎరువులకు, వడ్ల కొనుగోళ్లకు ఏనాడూ ఇబ్బంది రాలేదని తెలిపారు.
కేసీఆర్ హయాంలో కాళేశ్వరం జలాలతో బంగారం లాంటి పంటలు పండిస్తే ఇవాళ కొనేవాడు లేక ఆ పంట అమ్ముకోవడం రైతులకు కష్టమైపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.సాధారణంగా రోహిణీ కార్తె నాటికి వడ్ల కొనుగోళ్లు పూర్తవుతాయి. కానీ ఈ ప్రభుత్వం ఆన్ లైన్ ట్యాగింగ్, కొత్త రూల్స్ పేరుతో నెల రోజులు కాలయాపన చేయడం వల్లే నేడు ఈ దుస్థితి దాపురించిందని ఆరోపించారు.
ఏసీ రూముల్లో కూర్చుని మాట్లాడేవారికి నిజాలు తెలియవు
రాష్ట్రంలో 80 శాతం వడ్లు కొన్నామని ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఏసీ రూముల్లో కూర్చుని చెబితే నిజాలు తెలియవని, ఏ మార్కెట్ కి పోయినా ఇంకా సగం ధాన్యం కల్లాల్లోనే మగ్గుతోందన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు. వెంటనే ముఖ్యమంత్రి , మంత్రులు స్పందించి కలెక్టర్లు, తహసీల్దార్లు, డీఆర్డీఏ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి తడిసిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు.
ఎలాంటి ఆంక్షలు లేకుండా తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని కోరారు. రైస్ మిల్లర్లు బస్తాకు 43 కిలోలు పెడితేనే దించుకుంటామని, లేకపోతే మిల్లుల దగ్గరకు రావొద్దని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. తొలుత 90 లక్షల టన్నులు కొంటామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు 70 లక్షలే కొంటాననడం సిగ్గుచేటని విమర్శించారు.
రాష్ట్రంలో కోటి 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుంటే, కేంద్రం కేవలం 51 లక్షల టన్నుల కోటానే ఇవ్వడం శోచనీయమని ఆరోపించారు. బీజేపీ ఎంపీలు ఇక్కడ ధర్నాలు చేయడం కాదు. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కోటా పెంచేలా కొట్లాడాలని సూచించారు. వానాకాలం వస్తున్నా ఇంతవరకు జీలుగ, జనుము విత్తనాలు, ఎరువుల స్టాక్ రెడీ చేసుకోలేదని కాంగ్రెస్ఫై మండిపడ్డారు.
ప్రజలపై రూ. 5వేల కోట్ల పెట్రో భారం
కేంద్రం మూడు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి 3 వేల కోట్ల భారం మోపితే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ (VAT) పెంచి మరో 2 వేల కోట్ల భారం ప్రజలపై మోపిందని ఇద్దరూ కలిసి 5 వేల కోట్లు దోచుకుంటూ రైతుల, సామాన్యుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ధర్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 27శాతం వ్యాట్ ను 10 శాతంకు తగ్గించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.
బక్రీద్ పండుగ వస్తుండటంతో లారీ డ్రైవర్లు దొరకరని, ప్రభుత్వం వారం రోజుల పాటు ఇసుక తవ్వకాలను, రవాణాను ఆపి వేలాదిగా ఉన్న ఆ ఇసుక లారీలను, ఆర్టీఏ అధికారులను వడ్ల రవాణాకు కేటాయించాలని సూచించారు.