హైదరాబాద్, జూలై 3(నమస్తే తెలంగాణ): అర్చక ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బుధవారం హైదరాబాద్‌లోని శ్రీవీరాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగిన జేఏసీ అర్చక ఉద్యోగుల రాష్ట్ర కమిటీ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. అర్చక ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి జూన్ 2, 2014 వరకు ఉన్న కటాఫ్ తేదీని తొలగించి 2017 వరకు ఉద్యోగాల్లో ఉన్నవారినందరినీ రెగ్యులరైజ్ చేయాలని, అర్చక ఉద్యోగుల కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని, వెల్ఫేర్ బోర్డు ద్వారా అర్చక ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖ మంత్రి సురేఖ, ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావును కోరారు. సమావేశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులు, అర్చక సంఘం అధ్యక్షుడు బద్రీనాథాచార్యులు, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కృష్ణమాచార్యులు, వరింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖరశర్మ, గౌరవాధ్యక్షుడు కరుణాకర్ నాయుడు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శిగా లోకేశ్ కుమార్
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా లోకేశ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ముఖ్య కార్యదర్శిగా ఉన్న సందీప్‌కుమార్ సుల్తానియా ఇటీవల ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ కావడంతో ఎన్నికల కమిషన్ అదనపు సీఈవోగా బాధ్యతలు నిర్వస్తున్న లోకేశ్కుమార్ను అదనంగా పీఆర్, ఆర్డీ కార్యదర్శిగా నియమించారు. లోకేశ్‌కుమార్ గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేశారు.