హైదరాబాద్, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ) : తెలంగాణ పౌరసరఫరాల శాఖ నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్న ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రకు ఆ శాఖలో సమస్యలు సవాల్‌గా మారాయి. ఆయన నేతృత్వంలోనైనా ఆ శాఖ గాడిలో పడుతుందా? పరిస్థితులు అలాగే కొనసాగితే ఏకంగా ఆ సంస్థ దివాలా తీసి, భవిష్యత్తులో మూతపడటం ఖాయమనే ఆందోళన ఆ శాఖ ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నది. తెలంగాణ పౌరసరఫరాల శాఖలో అధికారుల అలసత్వం, ప్రచార యావ, అవినీతి కంపు.. వెరసి సంస్థ మొత్తం అస్తవ్యస్థంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పౌరసరఫరాల సంస్థను గాడిలో పెడతామంటూ తొలుత గొప్పగా ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కమిషనర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారిని తప్పించి, ఏరికోరి ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్‌ను కమిషనర్‌గా నియమించారు. అయినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని ప్రభుత్వ వర్గాలే చెప్తున్నాయి. బాగుపడటం దేవుడెరుగు.. ఈ ఏడాదిన్నర కాలంలో ఆ సంస్థ తిరోగమనంలో పయనించిందనే విమర్శలున్నాయి. టెండర్ ధాన్యం నగదు వసూళ్లలో, మిల్లర్ల నుంచి సీఎమ్మార్ వసూలులో, మిగిలిన దొడ్డు బియ్యాన్ని విక్రయించడంలో ఆ శాఖ ఘోరంగా విఫలమైందనే విమర్శలున్నాయి. దీంతో సివిల్ సప్లయ్ మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆందోళన నెలకొన్నది. దీనికి తోడు భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకున్నదనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వం డీఎస్ చౌహాన్‌ను బదిలీ చేసి.. ఆయన స్థానంలో మరో ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను తాజాగా కమిషనర్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన నేతృత్వంలో అయినా సివిల్ సప్లయ్ సంస్థ గాడిలో పడుతుందా? అనే చర్చ ఆ శాఖ ఉద్యోగుల్లో జోరుగా జరుగుతున్నది.
టెండర్ల ద్వారా విక్రయించిన ధాన్యం సివిల్ సప్లయ్‌కు గుదిబండగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు, ప్రభుత్వ అనాలోచిత, పక్షపాత నిర్ణయాలు ఆ శాఖ తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. 2024 ఫిబ్రవరిలో రూ.7వేల కోట్ల విలువైన 38 లక్షల టన్నుల ధాన్యాన్ని సివిల్ సప్లయ్ టెండర్ ద్వారా విక్రయించింది. ఏడాదిన్నర దాటినా బిడ్డర్ల ద్వారా ఆ ధాన్యాన్ని ఎత్తించడంలో, డబ్బులు వసూలు చేయడంలో సివిల్ సప్లయ్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారని తేలింది. ఆ తర్వాత కూడా కేవలం 20 లక్షల టన్నులు మాత్రమే తీసుకెళ్లిన బిడ్డర్లు ఇంకా 18 లక్షల టన్నుల ధాన్యాన్ని అలాగే వదిలేశారు. టెండర్ ధాన్యం ఎత్తడం లేదనే సాకుతో ఇటీవలే టెండర్లను సివిల్ సప్లయ్ రద్దుచేసింది. తద్వారా ఇంకా 18 లక్షల టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉండిపోవడంతో సివిల్ సప్లయ్‌కు రూ.3,600 కోట్ల నష్టం వాటిల్లిందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మిగిలిన ధాన్యాన్ని ఏం చేయాలని, ఆ నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయాలనేది పెద్ద సవాల్‌గా మారింది. ఈ టెండర్ ప్రక్రియ వల్ల అసలు, వడ్డీ కలిపి సుమారు రూ.5వేల కోట్ల వరకు న ష్టం వాటిల్లినట్టు అధికార వర్గాలే చెప్తున్నాయి.
సన్న బియ్యం పంపిణీ నిర్ణయంతో రేషన్ షాపులు, గోదాముల్లో మిగిలిన దొడ్డు బియ్యాన్ని విక్రయించడంలోనూ అధికారుల అలసత్వం సంస్థకు నష్టం చేసిందనే విమర్శలు ఉన్నాయి. రూ.500 కోట్ల విలువైన బియ్యం ఐదు నెలలుగా గోదాముల్లో మూలుగుతూ పురుగుపట్టిపోతున్నా వాటిపై నిర్ణయం తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సగం బియ్యం పాడైన తర్వాత ఇప్పుడు తీరిగ్గా ఆన్లైన్ ద్వారా విక్రయిస్తామంటూ సర్కార్ ప్రకటించింది. కిలో రూ.36 విలువ గల బి య్యాన్ని రూ.24 కనీస ధరగా ప్రకటించింది.
బీఆర్ఎస్ సర్కారు పదేండ్లలో పౌరసరఫరాల శాఖను అప్పుల కుప్పగా మార్చిందంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ శాఖ రూ.52 వేల కోట్ల అప్పుల్లో ఉన్నదని, తాము ఈ అప్పు తీర్చడంతోపాటు ధాన్యం కొనుగోలుకు, రేషన్ బియ్యానికి అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి చెల్లిస్తామని బీరాలు పలికారు. కానీ ఆ మాటలన్నీ నీటిమూటలయ్యాయి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ ప్రభుత్వం సివిల్ సప్లయ్‌కు రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రస్తుతం సివిల్ సప్లయ్ అప్పులు రూ.90 వేల కోట్లకు చేరినట్టు ఆ శాఖ అధికార వర్గాలే తెలిపాయి. అంటే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటల ప్రకారం బీఆర్ఎస్ పదేండ్లలో రూ.52 వేల కోట్ల అప్పులు చేస్తే.. కాంగ్రెస్ సర్కారు ఏడాదిన్నర కాలంలోనే రూ.38 వేల కోట్ల అప్పులు చేసినట్టు తేలింది. ఈ స్థాయిలో అప్పులు పెరగడానికి ప్రభుత్వ అసమర్థతే కారణమని తెలుస్తున్నది.