హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో చిల్లిగవ్వలేక కునారిల్లుతున్న పంచాయతీల్లో నెలకొన్న సమస్యలు నూతన సర్పంచులకు సవాళ్లు విసురుతున్నాయి. గ్రామాభివృద్ధే ధ్యేయంగా ఎన్నికైన ఆ ప్రజాప్రతినిధులకు ఖాళీ ఖాతాలే దర్శనమిస్తున్నాయి. అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్రం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే అనేక వీధుల్లో వెలుగని వీధిలైట్లు వెక్కిరిస్తున్నాయి. రిపేరుకు నోచని చెత్త సేకరించే ట్రాక్టర్లు అనేక పంచాయతీల్లో మూలనపడ్డాయి. జీపీ ఖాతాల లెక్కలను ఇంకా కార్యదర్శులు సర్పంచులకు అప్పగించనేలేదు. ఖాతాల్లో డబ్బులు ఉన్నాయా? లేవా అనే సంగతి కూడా సర్పంచులకు ఇంకా తెలియని పరిస్థితి ఉన్నది. పంచాయతీల ఇతర రికార్డులు కూడా కార్యదర్శుల వద్దే ఉన్నాయి. పంచాయతీ పాలకవర్గాలు ఏర్పాటైనందున 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు రావాల్సి ఉన్నది. ఈ నిధులు వస్తే సర్పంచులు అవసరమైన పనులు చేయాల్సి ఉంటుంది.
సర్పంచుల ఉక్కిరిబిక్కిరి
కాంగ్రెస్ సర్కారు సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామ పంచాయతీల అభివృద్ధికి వెన్నెముక లాంటి 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుంచి విడుదల కాకపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. గత సర్పంచులు గ్రామాల అభివృద్ధికి చేసిన పనుల పెండింగ్ బిల్లులు రూ.531 కోట్లు పేరుకుపోయాయి. రెండేండ్లలో అత్యవసర పనుల కోసమే తమ జేబుల్లో నుంచి గ్రామాలను బట్టి రూ.1లక్ష నుంచి 5 లక్షల వరకు ఖర్చు చేసినట్టు కార్యదర్శుల సంఘాల నేతలు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో సర్పంచులకు గ్రామ సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.
నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు
పంచాయతీ ఎన్నికలు నిర్వహించినందున 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చే యాలని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించినట్టు పంచాయతీరాజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలు జరుగని కారణంగా 2024-25లో రూ.1,514 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,477 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉన్నట్టు తెలిపాయి. కేంద్రం నుంచి సుమారు రూ.3,000 కోట్ల నిధులు వస్తే అంతే మొత్తంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ (ఎస్ఎఫ్సీ) నుంచి నిధులు జమ అవుతాయని పేర్కొన్నాయి.
బిల్లుల కోసం జీపీ కార్యాలయానికి తాళం వేసి నిరసన
ఏళ్లు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యాలయానికి కాంట్రాక్టర్ తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన ఉదంతం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మల్యాతండాలో వెలుగు చూసింది. మల్యాతండా గ్రామ పంచాయతీ భవనం, ప్రహరీ నిర్మాణాన్ని మూడేండ్ల క్రితం నాటి సర్పంచ్ సుజాత భర్త, కాంట్రాక్టర్ బోడ ఈర్యానాయక్ పూర్తిచేశాడు. అనంతరం ప్రభుత్వం మారగా, బిల్లులు రాకపోవడంతో శనివారం గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేశాడు.
రేపు మాజీ సర్పంచుల అసెంబ్లీ ముట్టడి సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలనే డిమాండ్‌తో సోమవారం అసెంబ్లీని ముట్టడించనున్నట్టు తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ కమిటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి కేశబోయిన మల్లయ్య శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచులకు రూ.531 కోట్ల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29 ‘చలో అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు తెలిపారు.