హైదరాబాద్, మే 21(నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలులో సమస్యలు నిజమే. వాటి కారణంగానే రైతులు చనిపోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అంగీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి కలెక్టర్లను ఆదేశించినట్టు వెల్లడించారు. తొలుత రైతుల మరణాన్ని హేళన చేసినట్టు సీఎం వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘రైతు చనిపోతే చూసేదేంటి? చనిపోయినట్టు అందరికీ తెలుసు కదా!’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇబ్బందికర ఘటనలు జరుగలేదని తాను చెప్పడంలేదని, రైతు చనిపోతే అక్కడికి వెళ్లి కొందరు రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలు చేయకపోడంతో మెదక్ జిల్లాలో రైతు రాజయ్య తన ఇంట్లో ఉరేసుకొని మరణించడంపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల కారణంగా కూలీలు అక్కడికి వెళ్లడంతో హమాలీల సమస్య ఏర్పడిందని, అందుకే ధాన్యం కొనుగోలులో ఆలస్యమైందని చెప్పారు. ఇప్పటివరకు 80% కొనుగోలు చేశామని, ఇంకా 20 శాతమే మిగిలి ఉన్నదని తెలిపారు. ఇప్పటివరకు 45 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తయ్యిందని మిగతా ధాన్యం కూడా కొంటామని తెలిపారు.
కార్మికుల కనీస వేతనాల పెంపు
కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించినట్టు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు 1.11 కోట్ల మంది కార్మికులకు మేలు జరుగుతుందని తెలిపారు. అన్స్కిల్డ్ క్యాటగిరీలో కనీస వేతనాన్ని రూ.12,750 నుంచి రూ.16 వేలకు, సెమీ స్కిల్డ్ క్యాటగిరీలో రూ.13,152 నుంచి రూ.17 వేలకు, స్కిల్డ్ క్యాటగిరీలో రూ.13,772 నుంచి రూ. 18,500కు, హైలీ స్కిల్డ్ క్యాటగిరీలో రూ.14,607 నుంచి రూ.20 వేలకు పెంచినట్టు తెలిపారు. ఈ నిర్ణయం ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.