తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ( Salakatla Brahmotsavams ) అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి ( Additional EO ) అధికారులను ఆదేశించారు. తిరుమల ( Tirumala ) పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నామని వివరించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సుల సంఖ్యను అవసరానికి అనుగుణంగా పెంచాలని సూచించారు. చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగ్ల పంపిణీని విస్తృతంగా చేపట్టాలని కోరారు. విద్యుత్ కేబుళ్లు, తాత్కాలిక విద్యుత్ వ్యవస్థల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
ముఖ్యంగా గరుడ వాహనం, చక్రస్నానం రోజున అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని సూచించారు. తిరుపతి జేఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో 25 రాష్ట్రాలకు చెందిన కళా బృందాల తో పాటు సింగపూర్, జర్మనీ నుంచి కూడా కళా బృందాలు వచ్చేలా చర్యలు చేపట్టామని తెలియజేశారు. ఈ సమీక్షలో టీటీడీ జేఈవో డాక్టర్ ఏ.శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, తదితర అధికారులు పాల్గొన్నారు.