Telangana | హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల్లో తమను ఉసిగొల్పి తీరా గద్దెనెక్కాక వదిలేసి మోసం చేసిన కాంగ్రెస్‌పై నిరుద్యోగులు రగిలిపోతున్నారు. తమకు జరిగిన అవమానం, అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పి తమ పవరేంటో చూపించాలని నిరుద్యోగ జేఏసీ నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ పోటీచేస్తున్న వయనాడ్‌లో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు. గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు పూర్తికాగానే నిరుద్యోగ జేఏసీ ప్రతినిధుల బృందం వయనాడ్ వెళ్లి ప్రియాంక ఓటమే ధ్యేయంగా ప్రచారం చేస్తుందని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో త్వరలోనే బస్సుయాత్ర నిర్వహిస్తామని, ఈ రెండు రాష్ర్టాల్లో కాంగ్రెస్ మోసాలను ఎండగట్టి, తమలా అక్కడివారు మోసపోవద్దని వివరిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. తెలంగాణలోనూ స్థానిక సంస్థల ఎన్నికల ముందు బస్సుయాత్ర చేపడుతామని చెప్పారు. కాంగ్రెస్ మోసాలపై కరపత్రం ముద్రించి ప్రచారం చేస్తామన్నారు. నిరుద్యోగులను కాంగ్రెస్ నమ్మించి గొంతుకోసిందని, ఇదే విషయాన్ని ఓటర్లకు వివరిస్తామని తేల్చిచెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆ పార్టీకి వ్యతిరేకంగా మహారాష్ట్ర బస్సుల్లో ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసిందని పోస్టర్లు ముద్రించి, ప్రచారాన్ని ప్రారంభించారు.
కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్తాం
నిరుద్యోగుల పాలిట కాంగ్రెస్ శాపంగా మారింది. గ్రూప్ -1లో జీవో 29ని తెచ్చి రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తూ తీరని అన్యాయం చేస్తున్నది. మేం కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా మమ్మల్ని సముదాయించే ప్రయత్నం చేశారు. గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ ఖరారు విషయంలో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని, వికీపిడియా, గూగుల్ ప్రమాణికమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తన అవివేకాన్ని చాటుకున్నది. మ్యానిఫెస్టోలో 30 అంశాలుపెట్టి, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మబలికి మోసం చేసింది. మొండిగా వ్యవహరించిన కాంగ్రెస్‌కు మేమంతా గట్టి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాం. నిరుద్యోగులమంతా వయనాడ్‌లో గడపగడపకు తిరిగి, ప్రియాంకగాంధీని ఓడించేందుకు ప్రచారం చేస్తాం. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కాంగ్రెస్ ఉనికి లేకుండా చేస్తాం.
– రమావత్ ఇంద్రకుమార్నాయక్
కాంగ్రెస్ ఓటమే లక్ష్యం
కాంగ్రెస్ వస్తే మా బతుకులు మారుతాయనుకున్నం. అత్యంత వేగంగా తప్పుల్లేకుండా నోటిఫికేషన్లు ఇస్తారనుకున్నం. కానీ కాంగ్రెస్ సర్కారు మొండిగా వ్యవహరిస్తూ తప్పుల మీద తప్పులు చేస్తున్నది. తప్పులు చేసినా అడగొద్దు.. ప్రశ్నించొద్దు అన్నట్టు నిరంకుశంగా వ్యవహరిస్తున్నది. పైగా మేమే నోటిఫికేషన్లను అడ్డుకుంటున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నది. నిరుద్యోగుల జీవితాలతో దుర్మార్గంగా ఆడుకుంటున్నది. నిరుద్యోగులపై లాఠీలను ప్రయోగించి రక్తాన్ని కండ్ల చూసింది. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధిచెప్పేందుకు మేం ప్రియాంక గాంధీ పోటీచేస్తున్న వయనాడ్‌కు బయలుదేరబోతున్నం. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా బస్సుయాత్ర నిర్వహించి ప్రచారం చేస్తం.
– జనార్ధన్ అనుములపురి