CM Revanth Reddy | ములుగు, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఈ నెల 27న మరో రెండింటిని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. గ్యారెంటీలను ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీని ఆహ్వానిస్తామని చెప్పారు. మేడారం మహాజాతర సందర్భంగా గురువారం సీఎం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల ఆశీర్వాదంతోనే తాను సీఎం అయ్యానని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లోని రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఒక్కో కుటుంబానికి రూ.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాలను 27న ప్రారంభిస్తామని ప్రకటించారు.
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని అమలుచేస్తామని, త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని పేర్కొన్నారు. మార్చి 2వ తేదీన మరో 6 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని తెలిపారు. యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు 10 స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. త్వరలో ప్రెస్ అకాడమీ చైర్మన్‌ను నియమిస్తామని చెప్పారు. పది సీట్లు బీజేపీకి, ఏడు సీట్లు కేసీఆర్‌కు అని మాట్లాడుకొని పార్లమెంట్ ఎన్నికలకు రాబోతున్నారని విమర్శించారు. రాబోయే సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
దక్షిణ భారతదేశ కుంభమేళ వంటి సమ్మక్క-సారలమ్మ జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించాలని సీఎం డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మేడారానికి జాతీయ హోదా కుదరదని అంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణకు అనుమతించిన తర్వాత బీజేపీ నాయకులు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటివారంలో వేతనాలు అందిస్తున్నామని తెలిపారు. మేడారం జాతరను 1996లోనే రాష్ట్రపండుగగా గుర్తించగా, సీతక్క కృషితోనే మేడారానికి రాష్ట్ర పండుగ హోదా వచ్చిందని సీఎం చెప్పడం గమనార్హం. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, సీతక్క, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.