హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ‘మీరు ప్రభుత్వ ఉద్యోగులా? సిబిల్ స్కోర్ లేక లోన్ రావడం లేదని బాధపడుతున్నారా? అయితే మీకు మేమున్నాం. కమీషన్ కొట్టు.. లోన్ పట్టు. అందుకు అవసరమైన గ్యారెంటర్లను మేమే ఏర్పాటు చేస్తాం’ అంటున్నారు హైదరాబాద్ ఎస్సార్‌నగర్‌లోని జై బ్రింద హనుమాన్ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్వాహకులు. అలా వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రూ.లక్షల కమీషన్ దండుకున్నారు. వారిలో కేవలం కొందరికి మాత్రమే రుణాలిచ్చి, మిగిలినవారిని చెప్పులు అరిగేలా తిప్పించుకుంటున్నారు. రూ.5,900 అప్లికేషన్ ఫీజుతోపాటు లక్షల్లో కమీషన్ పుచ్చుకుని 2-3 నెలలు గడిచాక మీ ఫైల్ రిజెక్ట్ అయ్యిందని చెప్తున్నారు. దీనిపై బాధితులెవరైనా ప్రశ్నిస్తే పోలీసులను, ఓ పెద్ద మీడియా సంస్థకు చెందిన విలేకరిని ఉసిగొల్పి లొంగదీసుకుంటున్నారు.
తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాల్లో ఎనిమిదేండ్లుగా ఈ దందా కొనసాగుతున్నది. ఈ వ్యవహారంపై 60 మంది బాధితులు ఇటీవల హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సదరు కంపెనీకి చెందిన వెంకట్, గోవింద్ తదితరులపై డిసెంబర్ 29న బీఎన్ఎస్లోని 318(4) రెడ్ విత్ 61(2) సెక్షన్‌తోపాటు ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ సెక్షన్ 5 కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కంపెనీకి హైదరాబాద్‌తోపాటు ఏపీలోని విశాఖపట్నం, ఏలూరులోనూ శాఖలు ఉన్నట్టు తెలుస్తున్నది.