హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్వై) నాలుగో దశలో భాగంగా తెలంగాణలో రోడ్డు కనెక్టివిటీ లేని 227 గ్రామీణ ప్రాంతాల్లో 642 కి.మీ. రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూ రు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కేంద్రాన్ని కోరనున్నది. పీఎంజీఎస్వై 4వ దశలో భాగంగా రాష్ట్రంలో నిర్మించే రోడ్లకు సంబంధించిన ప్రతిపాదనలపై సీఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది.
సీఎస్ మాట్లాడుతూ.. పీఎంజీఎస్వైలో భాగంగా ఇప్పటివరకు మూడు దశల్లో రహదారులు, వంతెనల నిర్మాణ పనులను పూర్తిచేశామని తెలిపారు. నాలుగో దశలో పకా రహదారులు లేని 227 గ్రామీణ ప్రాంతాల్లో 642.23 కి.మీ. రోడ్ల నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు వెల్లడించారు. వీటిలో 148 కి.మీ. రోడ్లకు సంబంధించిన 34 పనులకు అటవీ శాఖ అనుమతులు పొందాల్సి ఉన్నదని, ఈ మార్గాల్లో బ్రిడ్జీల నిర్మాణ పనులకు వారం రోజుల్లో డీపీఆర్లను సిద్ధం చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ తెలిపారు.