హైదరాబాద్, ఏప్రిల్ 4 : బాయిల్డ్ రైస్‌ను విదేశాలకు ఎగుమతి చేస్తూనే, చేసే అవకాశం లేదంటూ కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ అబద్ధాలు చెప్పి పార్లమెంట్ ప్రతిష్ఠను దిగజార్చారని టీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. పార్లమెంట్‌ను, దేశప్రజలను తప్పుదారి పట్టించిన గోయల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాయిల్డ్ రైస్ ను ఎగుమతి చేయడం లేదంటూ చెప్పిన గోయల్‌పై టీఆర్ఎస్ ఎంపీలు మంగళవారం పార్లమెంట్ ఉభయసభల్లో సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇ చ్చారు. వాటిని తిరస్కరించటంతో ఉభయసభలను ఎంపీలు వాకౌట్ చేశారు.
రాష్ట్ర రైతులు పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేసేదాకా పోరాటాన్ని ఉధృతం చేస్తామని తేల్చిచెప్పారు. బచావో.. బచా వో.. తెలంగాణ కిసానోంకో బచావో అంటూ టీఆర్ఎస్ ఎంపీలు చేసిన నినాదాలతో పార్లమెంట్ మార్మోగింది. అనంతరం ఢిల్లీ తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, పోతుగంటి రాములు, గడ్డం రంజిత్‌రెడ్డి, వెంకటేశ్‌నేత, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పసునూరి దయాకర్, మాలోతు కవిత, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కే కేశవరావు మాట్లాడతూ పార్బాయిల్డ్ రైస్‌ను ఎగుమతి చేయటం లేదంటూ కేంద్రమంత్రి గోయల్ ఈ నెల 1న రాజ్యసభను తప్పుదోవ పట్టించారని చెప్పారు. డబ్ల్యూటీవో ఒప్పందాన్ని బూచిగా చూపి తెలంగాణ వడ్లను కేంద్రం కొనుగోలు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత 7 నెలలో 110 దేశాలకు ఎగుమతి అ యిన బియ్యంలో పార్బాయిల్డ్ రైస్ 13శాతం ఉన్నదని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ నివేదికలే ధ్రువీకరిస్తున్నాయని గుర్తుచేశారు. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్రికా దేశాలు పార్బాయిల్డ్ రైస్‌ను వినియోగిస్తున్నాయని చెప్పారు. పార్బాయిల్డ్ సమస్య తెలంగాణకే పరిమితం కాదని ఒడిశా, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ర్టాల్లోనూ ఉన్నదని అన్నారు. తెలంగాణలో యాసంగిలో పార్బాయిల్డ్ రైసే వస్తాయని.. దశాబ్దాలుగా ఎఫ్‌సీఐ వీటినే కొనుగోలు చేస్తుంటే, ఇప్పుడు సమస్య సృష్టిస్తున్నారని చెప్పారు. పీయూష్‌గోయల్ కావాలనే ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రాజ్యసభ సాక్షిగా చేసిన వ్యాఖ్యలే నిదర్శమని అన్నారు. ఎగుమతులకు అనుమతులు ఇచ్చేది కేంద్రమేనని గుర్తుచేశారు. వడ్లు కొనాలని కోరితే ‘మీ ప్రభుత్వం వచ్చినపుడు కొనుక్కోండి’ అంటూ తెలంగాణను హేళన చేసి మాట్లాడారని మండిపడ్డారు.
కిషన్‌రెడ్డికి బాధ్యత లేదా: నామా
కేంద్రం రూ.45,379 కోట్ల విలువైన పార్బాయిల్డ్ రైస్‌ను ఎగుమతి చేసిందని, అన్ని రాష్ర్టాల బియ్యాన్ని ఎగుమతి చేస్తూ తెలంగాణ రైస్‌ను ఎందుకు ఎగుమతి చేయటం లేదని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు ప్రశ్నించారు. డబ్ల్యూటీవో ఒప్పందం తర్వాత కూడా కేంద్రం విదేశాలకు పారాబాయిల్డ్ రైస్ ఎగుమతి చేస్తున్నదని, కేంద్ర వాణిజ్యశాఖ అధికారిక వెబ్సైట్లోనే ఈ విషయం ఉన్నదని తెలిపారు. రాష్ట్ర రైతాంగం పడుతున్న ఇబ్బందులను తొలగించే బాధ్యత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేదా అని ప్రశ్నించారు.
మోదీకి చేతకాకపోతే… కేసీఆర్ ఉన్నారు: ప్రభాకర్‌రెడ్డి
‘వడ్లు కొనటం చేతకాదని పార్లమెంట్ సాక్షిగా చె ప్పండి.. అప్పుడు మేమేంటో చూపిస్తాం’అని కేంద్రానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సవాల్ విసిరారు. ‘కేంద్ర ప్రభుత్వాన్ని నడపటం మోదీకి చేతకాకపోతే చెప్పండి. మా నాయకుడు కేసీఆర్ ఉన్నారు’ అని బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై నోరుపారేసుకుంటే సహించబోమని హెచ్చరించారు. కేంద్రం వడ్లు కొనేవరకు పోరాటం చేస్తామనిఎంపీ వెంకటేశ్ తేల్చిచెప్పారు.
కేజీబీవీ సిబ్బంది వేతనాలు
కేంద్రం పెంచాలి: బీబీ పాటిల్
కేజీబీవీ సిబ్బందికి వేతనాలు పెంచాలని టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ డిమాండ్ చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న 14,250 మంది సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని కోరారు. సోమవారం లోక్‌సభలో కేజీబీవీ సిబ్బంది సమస్యను ఎంపీ ప్రస్తావించారు. రాష్ట్రంలోని 475 కేజీబీవీ పాఠశాలల్లో, 96 జూనియర్ కాలేజీల్లో దాదాపు 1,71,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. కేజీబీవీ సిబ్బందికి వేతనాలు పెంచటంలో కేంద్రం నిర్లక్ష్యం చూపుతున్నదని చెప్పారు.
తెలంగాణ కిసానోంకో బచావో
బచావో..బచావో..తెలంగాణ కిసానోంకో బచావో అంటూ టీఆర్ఎస్ ఎంపీలు చేసిన నినాదాలతో పార్లమెంట్ మార్మోగింది. గోయల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన ఎంపీలు, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతాంగాన్ని తప్పుదారి పట్టించిన గోయల్‌పై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని వీడాలని డిమాండ్ చేశారు. కేంద్రం రైతు వ్యతిరేక వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు ఉభయ సభల నుంచి వాకౌట్ చేశారు.