హైదరాబాద్, జనవరి 22 (నమస్తేతెలంగాణ) : ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ ప్రయత్నాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని సిబ్బందికి, ప్రజలకు సంస్థ విజ్ఞప్తి చేసింది. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టంచేసింది. బుధవారం టీజీఎస్ఆర్టీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల మెయింటనెన్స్, చార్జింగ్ మినహా ఆపరేషన్స్ అంతా టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని స్పష్టంచేసింది. ఎలక్ట్రిక్ బస్సులను నేరుగా కొనాలంటే వ్యయంతో కూడుకున్నదని, ఈ నేపథ్యంలోనే కేంద్రప్రభుత్వ ఈవీ పాలసీ మేరకు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్ధతిన.. అంటే బస్సు తిరిగే కిలోమీటర్ల ప్రకారం కంపెనీలకు చెల్లింపులు చేస్తున్నామని వివరించింది. సంస్థలో కొత్త బస్సుల కొనుగోలు జరగడం లేదనేది వాస్తవంకాదని పేర్కొంది.