నల్లగొండ: నల్లగొండ పట్టణంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) బోల్తాపడింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ రోడ్డు చంద్రగిరి విల్లాస్ కాలనీకి వెళ్లే దారి వద్ద వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపుతప్పి పల్టీలు కొట్టి బోల్తా పడిపోయింది. దీంతో 20 మంది గాయపడ్డారు. సమాచారం అందుకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు.
ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్నదని చెప్పారు. మర్రిగూడ బైపాస్ వద్ద వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో.. రోడ్డుపై అడ్డంగా పెట్టిన బారికేడ్లను తప్పించబోయి బస్సు పల్టీ కొట్టిందన్నారు. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారని తెలిపారు. వారంతా గాఢనిద్రలో ఉండగా బస్సు పల్టీకొట్టిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.