ఫర్టిలైజర్‌సిటీ, మార్చి 20 : పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు ఇచ్చేందుకు వచ్చి ఫొటోలు దిగుతున్న ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు అంతలోనే అస్వస్థతకు గురై మృతిచెందిన ఘటన గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని అడ్డగుంటపల్లిలో గల శ్రీరామ విద్యానికేతన్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బలసాని సత్యం(46) పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుకలకు హాజరయ్యారు. వారికి ఆల్‌ది బెస్ట్ చెపుతూ ఫొటోలు దిగుతుండగా అంతలోనే అస్వస్థతకు గురికావడంతో తోటి ఉపాధ్యాయులు గోదావరిఖని ఏరియా దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు పేర్కొన్నారు. రాంనగర్‌కు చెందిన సత్యం పాతికేళ్లుగా ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.