Private Schools | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు బడి ఫీజు భారమైంది. అక్షరాలు దిద్దించడానికే లక్షలు దాటింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరీ క్రమం తప్పుతున్నది. ఫలితంగా పిల్లల చదువు తల్లిదండ్రులకు భారంగా మారుతున్నది. తల్లిదండ్రుల ఆశలను అవకాశంగా మలుచుకున్న ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు వివిధ పేర్లతో బురిడీ కొట్టిస్తున్నాయి. దీంతో అత్యాశకు పోయి లక్షలు కుమ్మరిస్తూ భారం భరిస్తున్నారు. ఒకప్పుడు గ్రామర్, కాన్సెప్ట్ స్కూళ్లు అంటేనే అదేదో బ్రహ్మ పదార్థంలా చూసేవారు. ఇప్పుడు కాన్సెప్ట్ పోయి టాలెంట్, టెక్నో, ఈ-టెక్నో, డీజీ, మోడల్ స్కూల్, ఐఐటీ, జేఈఈ, సివిల్స్ ఫౌండేషన్ అంటూ తల్లిదండ్రులను ఊహాలోకంలోకి తీసుకెళ్లేందుకు పాఠశాల యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి.
విద్య అంటే కేవలం ఓ వ్యాపారంగా మలిచారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లోని చాలా పాఠశాలలు వ్యాపార కార్యాలయాలుగా మారాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన మహోన్నతమైన బాధ్యతను కేవలం లాభాలు గడించుకోవడానికే కుయుక్తులు పన్నుతున్నాయి. గ్రేటర్లో పాఠశాలలు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై భారం మోపుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పటికే 80 శాతం అడ్మిషన్లు పూర్తయ్యాయి.
కనీసం నోటీసు బోర్డుపై ఏ తరగతికి ఎంత ఫీజు వసూలు చేస్తామో కూడా చెప్పకుండా పరిమితి లేకుండా ఫీజులను వాళ్లే నిర్ణయించేస్తున్నారు. గ్రేటర్లోని కొన్ని పాఠశాలల్లో ఎల్కేజీకి వసూలు చేస్తున్న ఫీజులు.. ఇంజినీరింగ్, మెడిసిన్, డెంటల్ కాలేజీల ఫీజుల కన్నా అధికంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇంజినీరింగ్లో గరిష్ఠంగా అధికంగా రూ.2.15 లక్షల ఫీజు ఉంటే, ఓ పాఠశాలలో ప్రీ ప్రైమరీకి రూ.2.10 లక్షలు వసూలు చేశారు. ఫీజుల కట్టడిపై జిల్లా విద్యాశాఖ అధికారులకు ఎలాంటి నియంత్రణ ఉండకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
అక్షరాలు దిద్దేంచేందుకే లక్షలు వసూలు చేస్తున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్లో చాలా పాఠశాలల్లో ఎత్తయిన గోడలు, ఏసీ తరగతి గదులు, ప్రత్యేకమైన టేబుళ్లు, కుర్చీలు, ఏసీ బస్సులు, డిజిటల్ బోర్డులు, డిజిటల్ మెటీరియల్ చూపి, భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంత గొప్పగా సౌకర్యాలు ఉన్నా, బోధన తీరులో గొప్ప మార్పులేమైనా ఉంటాయా? అంటే విద్యావేత్తల నుంచి లేదనే సమాధానమే వస్తున్నది. తమ పిల్లలను పెద్ద పాఠశాలల్లో చదివించాలన్న తల్లిదండ్రుల తపనే తప్ప అంతర్జాతీయ ప్రమాణాలు అని చెప్పుకుంటున్న పాఠశాలల్లో ప్రమాణాలు సాధారణ పాఠశాలల మాదిరిగానే ఉన్నాయని వారు స్పష్టం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ బోర్డు తగిలించుకున్న పాఠశాలలు ఎల్కేజీకే రూ.1.25 లక్షలకు వసూలు చేస్తున్నాయి.
హైదరాబాద్ పరిధిలో 3,500 వరకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. చాలా విద్యాసంస్థలు ఇంటర్నేషనల్ స్కూళ్ల పేరుతో రాజ్యమేలుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకున్నా దర్జాగా బోర్డులు తగిలించుకొని దందా చేస్తున్నాయి. సీఐఎస్ (కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్) గుర్తింపు ఉన్న పాఠశాలలు మాత్రమే ఇంటర్నేషనల్ బోర్డులు పెట్టుకోవాలి. ఈ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న పాఠశాలలను ఆ సంస్థ అన్ని విధాలుగా పరిశీలించి ఆమోదం తెలుపుతుంది. గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, బోధనా సామగ్రిలాంటి 25 అంశాలను పరిగణనలోకి తీసుకుని గ్రేడింగ్స్ జారీ చేస్తుంది. కానీ నగరంలోని చాలా పాఠశాలలు గుర్తింపు లేకున్నా ట్యాగ్ తగలించుకుంటున్నాయి.
పాఠశాలల్లో అక్రమ ఫీజుల వసూళ్లపై ఫిర్యాదులు అందుతున్నాయి. అక్రమ ఫీజులపై కఠినంగా వ్యవహరిస్తాం. ఈ ఏడాది పాఠశాలల్లో వసూలు చేస్తున్న ఫీజుల జాబితాను నోటీసు బోర్డులో ఏర్పాటు చేసేలా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చాం. ఆ ఫీజుల కన్నా అధికంగా వసూలు చేస్తే తల్లిదండ్రులు ఫిర్యాదు చేయొచ్చు.
-రోహిణి, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి
ఫీజులు ఇష్టాననుసారం పెంచేస్తున్నారు. వారు నిర్ణయించిన తేదీల్లో చెల్లించకుంటే కనీసం సమయం కూడా ఇవ్వకుండా విద్యార్థుల తల్లిదండ్రుల గ్రూపుల్లో ఫీజు చెల్లించలేదంటూ పేర్లు పెట్టి పరువు తీస్తున్నారు. దీంతో చిన్నారులు బాధపడాల్సి వస్తున్నది. కనీసం వెసులుబాటు కూడా ఇవ్వడం లేదు. చిన్నతరహా స్కూళ్లలోనూ ఫీజులు రూ.50 వేలకు పైగానే వసూలు చేస్తున్నారు.
-ప్రకాశ్, పేరెంట్, హైదరాబాద్