హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చాలా స్కూల్ బస్సులు ప్రమాదకరంగా మారాయి. 33 జిల్లాల పరిధిలో 25,953 ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉండగా వాటిలో 22,576 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేసినట్టు రవాణాశాఖ లెక్కలు చెప్తున్నాయి. పరీక్షలు చేయించుకోని స్కూల్ బస్సులు 3,377 ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆ బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయా? తుక్కుకు వెళ్లాయా? అనేది అధికారులకు స్పష్టతలేదు.
ఫిట్నెస్లేని బస్సులను తుక్కుకు పంపించామని పలు పాఠశాలల యజమానులు చెప్తున్నారు. కానీ మిగిలిన బస్సుల సంగతి ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కో జిల్లాలో సగటున 100 బస్సులు ఫిట్నెట్ పరీక్షలు చేయించుకోలేదని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తమ పిల్లల స్కూల్ బస్సులకు ఫిట్నెస్ ఉందో లేదో అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేయడం కాకుండా నిరంతర పర్యవేక్షణపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫిట్నెస్ లేని బస్సులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని రవాణాశాఖ అధికారులే చెప్తున్నారు. అలాంటి బస్సుల పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని చెప్పారు. సిబ్బందిని పాఠశాలల వద్దకు పంపించి తనిఖీలు చేస్తామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.