శేరిలింగంపల్లి, ఆగస్టు 7: ‘మా భూములు మాగ్గావాలె’ అంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న భాగ్యనగర్ టీఎన్జీవో ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించిన ఈ భూములపై హైకోర్టు స్టే ఇవ్వడంతో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. న్యాయం గెలించిందంటూ సంతోషం వ్యక్తంచేశారు. వివరాల్లోకి వెళ్తే.. భాగ్యనగర్ ఎన్జీవోలకు ఇళ్ల స్థలాల కోసం 189.11 ఎకరాల స్థలాన్ని ఏపీ ఎన్జీవోల నుంచి అప్పటి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది.
ఇటీవల ఈ భూముల్లో కొందరు ప్రైవేటు వ్యక్తులు చొరబడి రాత్రికి రాత్రే కంటెయినర్లు ఏర్పాటు చేసి లేఅవుట్లు ఏర్పాటు చేసి పనులు ప్రారంభించారు. ఈ విషయం ఉద్యోగుల దృష్టికి రావడంతో తమ భూములు తమకు అప్పగించాలంటూ ఆందోళనకు దిగారు. గోపన్‌పల్లిలోని బీటీఎన్జీవోల స్థలాల వద్ద 23 రోజులుగా రోజుకో తరహాలో భాగ్యనగర్ టీఎన్జీవో ఉద్యోగులు గాంధేయ మార్గంలో నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు, జేఏసీ నాయకులు, బీటీఎన్జీవో నాయకులు న్యాయ పోరాటం కొనసాగించారు. అయినప్పటికీ ప్రైవేటు వ్యక్తులు మాత్రం బెదరలేదు సరికదా, పనులు కొనసాగిస్తున్నారు.
గోపన్‌పల్లి స్థలాల విషయంలో బీటీఎన్జీవోలకు అనుకూలంగా హైకోర్టు స్టే ఇవ్వడంతో ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. మిఠాయిలు తినిపించుకున్నారు. హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణతో పాటు డైరెక్టర్లను ఉద్యోగులు పూలమాలలతో సత్కరించారు.
జేఏసీ మద్దతుతోనే విజయం:
గోపన్‌పల్లిలోని సర్వే నంబర్ 36లోని బీటీఎన్జీవోల స్థలాల్లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు నిర్మాణ పనులు కొనసాగిస్తున్న తరణంలో భాగ్యనగర్ ఎన్జీవోలకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఎసీ నిలిచిందని భాగ్యనగర్ ఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్ తెలిపారు. బీటీఎన్జీవోలకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపుతూ న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించాం. విచారించిన న్యాయస్థానం స్టే ఇచ్చింది. ప్రైవేట్ వ్యక్తుల నిర్మాణ పనులకు కోర్టు ఉత్తర్వులతో అడ్డుకట్ట పడింది. రాష్ట్ర జేఏసీ మద్దతుతో ఉద్యోగులు సాధించిన విజయమిది.
రంగారెడ్డి జిల్లా, శేరిలిగంపల్లి మండలంలో ఐటీ కారిడార్‌కు అనుకొని గోపన్‌పల్లి సర్వే నంబర్లు 36, 37లోని 189.11 ఎకరాల్లోని ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కొందరు ప్రభుత్వ పెద్దలు.. ప్రైవేటు సొసైటీలు, వ్యక్తుల పేరిట చేస్తున్న కుట్రలను ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో బహిర్గతం చేసింది. గోపన్‌పల్లి సర్వే నంబర్ 36లోని సబ్డివిజన్లు 36/ఎ, 36/ఇ, 36/ఎఎలోని 22.20 ఎకరాల్లో 17.04 ఎకరాలను నిషేధిత జాబిత నుంచి తొలగించాలని జూలై 23న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్‌కు లేఖ (నంబర్ ఇ1/202/2025) రాశారు. దీనిని భాగ్యనగర్ టీఎన్జీవో హైకోర్టులో సవాల్ చేయగా స్టే లభించినట్టు సత్యనారాయణ చెప్పారు.