హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఎలా పెరిగాయి? మరికొన్నింటిలో ఎలా తగ్గాయని పలు కాలేజీల యాజమాన్యాలు ప్రశ్నించాయి. కొన్ని కాలేజీలను లక్ష్యంగా చేసుకుని ఫీజులు తగ్గించడం భావ్యమేనా? అంటూ తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) ముందు గగ్గోలు పెట్టాయి. రాష్ట్రంలో ట్యూషన్ ఫీజుల సవరణలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని 12 కాలేజీలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఆయా కాలేజీల ఫీజులపై పునర్విచారణ జరుపాలని హైకోర్టు టీఏఎఫ్ఆర్సీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం 6 కాలేజీల్లో ట్యూషన్ ఫీజులపై టీఏఎఫ్ఆర్సీ పునర్విచారణ జరిపింది. ‘ఉన్న ఫీజులు ఎలా తగ్గిస్తారు? మా కాలేజీ ఫీజులో రూ.50వేలు కోత పెట్టారు’ అంటూ ఓ కాలేజీ యాజమాన్యం టీఏఎఫ్ఆర్సీని అభ్యర్థించింది. ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తే వ్యవస్థ ఎలా నడుస్తుందని మరో కాలేజీ యాజమాన్యం వాదనలు వినిపించింది. మంగళవారం మరో ఆరు కాలేజీల వాదనలను టీఏఎఫ్ఆర్సీ విననున్నది.