హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు మరోసారి సమ్మెకు సిద్ధపడ్డాయి. కాలేజీలను మూసివేయాలని నిర్ణయించాయి. బకాయిలను విడుదల చేయకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. ఈ మేరకు బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణారావును కలిసి నోటీసులు అందజేశాయి. నవంబర్ ఒకటో తేదీలోగా రూ. 900కోట్ల బకాయిలను విడుదల చేయాలని గడువుగా విధించాయి. ఈ గడువులోగా బకాయిలను విడుదల చేయకపోతే నవంబర్ 3 నుంచి కాలేజీలను మూకుమ్మడిగా మూసివేస్తామని నోటీసులో హెచ్చరించాయి.
ఫెడరేషన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్(ఫతి) చైర్మన్ డాక్టర్ ఎన్ రమేశ్‌బాబు, సెక్రటరీ జనరల్ కేఎస్ రవికుమార్, కోశాధికారి కొడాలి కృష్ణారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కే సునీల్‌కుమార్, రాందాస్ నోటీసును అందజేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం కాలేజీ యాజమాన్యాలు సెప్టెంబర్ నుంచి పోరుబాట పట్టాయి. సెప్టెంబర్ 15న ఓ సారి కాలేజీల బంద్ పాటించాయి. రూ.1200కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. రూ.300కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన రూ. 900కోట్లు విడుదల చేయలేదు. కాలేజీ యాజమాన్యాలు సమ్మెకు సిద్ధపడ్డాయి.