హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): సహజ న్యాయసూత్రాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేయాలని, బేసిన్లో ని ప్రాజెక్టులకే ప్రాధాన్యమివ్వాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ నివేదించింది. బేసిన్ అవతలి ప్రాంతాలకు జలాల తరలింపు వాంఛనీయం కాదని తెలిపింది. కేంద్రం జారీచేసిన సెక్షన్ 3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి విచారణను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ సోమవారం ఢిల్లీ లో పునఃప్రారంభించింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేష్‌కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర ఎదుట తెలంగాణ సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలను కొనసాగించారు. ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి ట్రిబ్యునల్ కేటాయింపులు లేవని వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో చేసిన అంతర్గత కేటాయింపులు అనుకూలంగానే ఉన్న నేపథ్యం లో అవే కేటాయింపులను ప్రస్తుతం కూడా కొనసాగించాలని ఏపీ వాదిస్తున్నదని వివరించారు. నీటి పంపిణీలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలు, న్యాయసూత్రాల ను పరిగణనలోకి తీసుకొని ఇరు రాష్ర్టాల మధ్య జలాల పునఃపంపిణీ చేయాలని కోరారు.
తెలంగాణలో తలసరి నీటి లభ్యత సంవత్సరానికి ఒక వ్యక్తికి 422 క్యూబిక్ మీటర్లు మాత్రమేనని, ఏపీలో జాతీయ సగటు కన్నా ఎకువని, అదీగాక ఏపీకి 40 నదీ పరీవాహక ప్రాంతాలున్నాయని, వాటిలో గణనీయమైన నీటిలభ్యత ఉంటుంద ని గణాంకాలతో సహా వివరించారు. ఏపీ మాత్రం కృష్ణా బేసిన్ వెలుపలకు పెన్నా బేసిన్‌కు జలాలను మళ్లిస్తున్నదని వెల్లడించారు. పోలవరం నుంచి పెన్నా బేసిన్ (బనకచర్ల)కు గోదావరి మళ్లింపునకు చర్యలు చేపట్టిందని వివరించారు. ప్రస్తుతం బేసిన్ లోపల ప్రాజెక్టులకు ఏపీ ఒక చుక నీటిని కోరడం లేదని, అన్నీ బేసిన్ ఆవల ప్రాజెక్టుల కోసం మాత్రమేనని తెలంగాణ న్యాయవాది తెలిపారు. తెలంగాణ ఇన్ బేసిన్ ప్రాజెక్టులకే నీటిని డిమాండ్ చేస్తున్నదని, ఆరుతడి పంటల కోసమే జలాలను కోరుతున్నదని వివరించారు. పలు అంశాలను ట్రిబ్యునల్‌కు విశదీకరించారు. అంతర్రాష్ట్ర జలవనరుల యూనిట్ ఇంజినీర్లు సల్లా విజయ్‌కుమార్, వెంకటనారాయణ, రవిశంకర్‌తోపాటు, ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా, ఆ రాష్ట్ర ఇంజినీర్లు విచారణకు హాజరయ్యారు. నేడు కూడా విచారణ కొనసాగనున్నది.