హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో బ్రహ్మకుమారిస్ స్పోర్ట్స్ కాంక్లేవ్‌కు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ, స్పోర్ట్స్ క్యాంపెయిన్ వెహికల్‌ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడా మైదానం, 6వేల జనాభా గల గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో రెండు శాతం రిజర్వేషన్లు, ఉన్నత విద్య అభ్యసించేందుకు 0.5 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నామన్నారు. ఇటీవల గుజరాత్లో జరిగిన జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు మూడో స్థానం సాధించి రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను పెంచారని అన్నారు.
స్పోర్ట్స్ కాంక్లేవ్ లో భాగంగా ఈనెల 15 నుంచి 22 వరకు బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో వివిధ క్రీడా అకాడమీలు, పాఠశాలల్లో ‘బాడీ అండ్ మైండ్ – ఫిట్ అండ్ ఫైండ్’ అనే శీర్షికన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారిస్ డైరెక్టర్ బీకే కులదీప్ దీదీ, స్టేట్ గాలరీ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మి, స్పోర్ట్స్ కో – ఆర్డినేటర్లు సిస్టర్ వసంత, బ్రదర్ వంశీధర్ పాల్గొన్నారు.