కొడంగల్, జూలై 3 : సీఎం ఇలాకాలోని ప్రభుత్వ దవాఖానలో పూర్తిస్థాయి సేవలు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని 50 పడకల దవాఖాన నుంచి 220 పడకలకు అప్‌గ్రేడ్ అయినప్పటికీ పూర్తి సౌకర్యాలు అందుబాటులోకి రాలేదని రోగులు, వారి సహాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రింటర్ చెడిపోవడంతో మెడికల్ రిపోర్టులు అందుకోలేకపోతున్నట్టు పేర్కొంటున్నారు. గత నాలుగైదు రోజులుగా కొడంగల్ దవాఖానలోని కంప్యూటర్ ప్రింటర్ మరమ్మతులకు నోచుకోకపోవడంతో దవాఖాన సిబ్బంది చేతిరాతతో రోగులకు రిపోర్టులు అందిస్తున్నారు. రక్త నమూనాకు సంబంధించిన రిపోర్టులు కావాలంటే కంప్యూటర్ తెరపై ఉన్న రిపోర్టులను మొబైల్ ఫోన్లో ఫొటో తీసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది.
ఈ దవాఖాన వైద్య విధాన పరిషత్‌లో కలవడంతో మెరుగైన వైద్య సేవలు అందుకోవచ్చని భావించిన వారికి నిరాశే మిగులుతున్నదని పలువురు రోగులు పేర్కొంటున్నారు. 50 పడకల దవాఖాన ఉన్నప్పుడే పరిస్థితి ఇలావుంటే 220 పడకల దవాఖాన భవనం పూర్తయిన తర్వాత రోగుల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. చిన్నపాటి ప్రింటర్ మరమ్మతులు చేపట్టకపోతే ఇక పూర్తిస్థాయి వైద్య సేవలు ఎలా అందుబాటులోకి వస్తాయని నిలదీస్తున్నారు. ఈ విషయమై ల్యాబ్ సిబ్బందిని వివరణ కోరగా.. ప్రింటర్ చెడిపోయినందున నాలుగైదు రోజులుగా చేతిరాత ద్వారానే రోగులకు రిపోర్టులు అందిస్తున్నట్టు తెలిపారు.