హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : ప్రధాని మోదీ హైదరాబాద్ సభలో చేసిన ప్రసంగం తెలంగాణ ప్రజల ఆశలను నీరుగార్చడమే కాకుండా, తీవ్ర నిరుత్సాహపర్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. ప్రధాని ఉపన్యాసంలో రాష్ట్ర సమస్యల ప్రస్తావనే లేదని, రాష్ట్రంలో అధికారంలోకి ఎలా రావాలనే అంశంపైనే తన దృష్టి కేంద్రీకరించినట్టు కనిపిస్తున్నదని ఆరోపించారు. హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ నీతి సూత్రాలు వ ల్లిస్తూ, ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారని ఎద్దేవా చేశారు.
రాష్ర్టానికి బయ్యారం ఉకు ఫ్యాక్టరీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకివ్వలేదు? బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎందుకు అడ్డుకుంటున్నారు? అని ప్రశ్నించారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఎందుకు తగ్గుతున్నాయోనన్న విషయంపై ఎందుకు సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరుగాలంటే తమతో జట్టుకట్టండని, తమకు అనుకూలంగా వ్యవహరించాలని, ముఖ్యమంత్రికి పరోక్షంగా ప్రధాని సంకేతమివ్వడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాట స్ఫూర్తితోనే బీజేపీకి ఇదే తెలంగాణ గడ్డ తగిన గుణపాఠం చెప్తుందని హెచ్చరించారు.
అంబర్‌పేట, మే 11 : కాంగ్రెస్ పార్టీని ‘ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్’ పార్టీ అంటూ సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ విమర్శించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు తప్పుబట్టారు. ఈమేరకు సోమవారం అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మోదీపై ఇన్స్పెక్టర్ టీ కిరణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. సామాజిక విభేదాలను రెచ్చగొట్టేలా మోదీ చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పనిసరిగా ఉండాలని కోరారు. పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.