నకిరేకల్, ఫిబ్రవరి 9 : ప్రధాని నరేంద్ర మోదీ మోసం బట్టబయలైందని, జాతీయత పేరుతో దేశ ద్రోహం చేస్తున్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని ముగ్గురు కాంగ్రెస్ ఎంపీటీసీలు, ఒక ఉప సర్పంచ్, కాంగ్రెస్, సీపీఎం నాయకులు, కార్యకర్తలు గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ సంపదను ఒకరిద్దరికి కట్టబెట్టేందుకు మోదీ సర్కార్ ప్రణాళికలు రూపొందించిందని విమర్శించారు. ఆ విషయాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో గుణపాఠం చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారని చెప్పారు.
దేశ ప్రజలు సీఎం కేసీఆర్ వైపు, బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాగుతున్న పాలనపై దేశ ప్రజలకు నమ్మకం ఏర్పడిందని అన్నారు. వ్యవసాయం, విద్యుత్తు, సాగు, తాగునీరు రంగాల్లో సాధించిన విజయాలతోపాటు ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఆసక్తిని పెంచుకున్న దేశ ప్రజలు.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో చందుపట్ల, చందంపల్లి, ఈదూలురు ఎంపీటీసీలు ఇమడపాక లక్ష్మీ వెంకన్న, బోయిళ్ల శేఖర్, తవిడబోయిన భవానితోపాటు నోముల ఉప సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, సీపీఎం సీనియర్ నాయకుడు భీమనబోయిన యాదగిరి తదితరులు ఉన్నారు.