హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30(నమస్తే తెలంగాణ): రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణ పనుల నిమిత్తం ఇప్పటినుంచే దేవాలయాల నిధులను మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవల బడ్జెట్లో పుష్కరాల నిర్వహణకు రూ.500 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ ముచ్చట ఇలా ఉండగానే, రాష్ట్రంలోని పలు దేవాలయాలకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లను తీయాలంటూ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారని సమాచారం.
ఎఫ్డీలు ఎంత ఉన్నాయి? వాటిని విడిపించడానికి ఎన్నిరోజులు పడుతుంది? అనే సమాచారాన్ని పలు ఆలయాలను అడిగి వివరాలు తీసుకున్నారని తెలిసింది. దేవాలయాలకు భక్తులు ఇచ్చే విరాళాలు, హుండీ ద్వారా వచ్చే ఆదాయం, ఇతర రూపాల్లో వచ్చిన నిధుల్లో ఖర్చులు పోను మిగతా డబ్బులను దేవాలయ నిర్వహణ, అత్యవసర ఖర్చుల నిమిత్తం దేవాలయం పేరుతో బ్యాంకుల్లో ఎఫ్డీలు చేయడం గతం నుంచి ఆనవాయితీగా వస్తున్నది.
దీంతో పలు ప్రధాన ఆలయాలకు కోట్ల రూపాయల నిధులు ప్రస్తుతం ఎఫ్డీల రూపంలో ఉండగా, వీటిని విడిపించి పుష్కరాల నిర్వహణకు ఖర్చు చేసేందుకు ప్రణాళిక సిద్ధంచేసినట్టు తెలిసింది. ప్రభు త్వ నిర్ణయంపై అర్చక ఉద్యోగులు మండిపడుతున్నారు. దేవాలయ ఆదాయం నుంచే కొంతమంది అర్చకులు, ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారు. కాగా, ఇప్పుడు ఈ ఎఫ్డీలను విడిపిస్తే వారికి పస్తులుండాల్సిన పరిస్థితి వస్తుందని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. గోదావరి పుష్కరాలకు ఆలయ నిధులను వాడటం సరి కాదని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని అర్చక ఉద్యోగులు కోరుతున్నారు.