బాసర, మే 14: బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారిపై బుధవారం సాయంత్రం ఆంధ్రా స్వాములోరి అనుచరుడు దాడి చేశాడు. రోజూ మాదిరిగానే వాకింగ్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చి ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ.. తమ జోలికి వస్తే చంపేస్తామంటూ బెదిరించాడు. పూజారి కథనం ప్రకారం.. సంజీవ్ పూజారి రోజూ మాదిరిగానే బుధవారం సాయంత్రం కమ్మసంఘం ఎదురుగా ఉన్న దారిలో (ఆంధ్రా స్వాములోరి శ్రీ వేద భారతి పీఠం ముందు) వాకింగ్ చేస్తున్నారు. వెనుక నుంచి వచ్చిన స్వాములోరి అనుచరుడు నూకం రామారావు పూజారిని దుర్భాషలాడుతూ ముఖం, తలపై తీవ్రంగా దాడి చేశాడు.
బూతులు తిడుతూ.. ‘నిన్ను ఇంటికి చేరుకునేలోపు చంపేస్తాం. వేద భారతి పీఠం స్వామీజీ అనుకుంటే నిన్ను ఇప్పుడే చంపేస్తాం. నువ్వు ఆలయంలో ఉద్యోగం ఎలా చేస్తావో మేము చూస్తాం’ అంటూ దాడి చేశాడు. దీంతో అక్కడి నుంచే ‘100’ నంబర్‌కు ఫోన్ చేశానని, కాల్ కలువకపోవడంతో ఎలాగోలా తప్పించుకొని ఇంటికి చేరుకున్నానని సంజీవ్ పూజారి తెలిపారు. తన సోదరుడి కుమారుడు వెంకటేశ్ పూజారి పోలీసులకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. నూకం రామారావు, ఆంధ్రా స్వాములోరి నుంచి తనకు ప్రాణహని ఉందని తెలిపారు. బాసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.
విచారణ సమయంలోనే దాడి..
శ్రీ వేద భారతి పీఠం పాఠశాల నిర్వాహకుడు వేదావిద్యానందగిరి స్వామిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. వేద పాఠశాలలో ఓ బీసీ విద్యార్థి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితికి చేరుకోగా, సాక్షిగా ఉన్న మరో బీసీ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఆంధ్రా సాములోరి లీలలపై ‘బాసరలో నెత్తుటి ఘోష’ ‘మణికంఠది హత్యా.. ఆత్మహత్యా?’ ‘ఆంధ్రా సాములోరా.? బాసర అమ్మవారా?’ ఇలా వరుస కథనాలు ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమయ్యాయి. విద్యార్థులపై దాడి.. స్వామీ ఆగడాలపై రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆర్డీవో ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని నియమించి విచారణకు ఆదేశించింది.
ఇంత వివాదం జరుగుతున్న సమయంలోనే ఆలయ ప్రధాన అర్చకుడిపై.. ఆంధ్రాస్వాములోరి అనుచరుడు దాడి చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై బాసర గ్రామస్థులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విచారణను తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతోనే వేద పాఠశాల నిర్వాహకులు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. పూజారిపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నత స్థాయి కమిటీ త్వరగా విచారణ పూర్తి చేసి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.