CS Rangarajan | తనపై దాడి చేసిన వారిని వదిలేది లేదని, చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 7న పలువురు తమ ఇంటికి వచ్చి తలుపులు తట్టారని.. ఆ సమయంలో తాను స్నానం చేయనుందునే టీషర్టులో ఉన్నానని.. ఇప్పుడు ఎవరినీ కలవలేనని చెప్పానన్నారు. వారిలో నల్ల బట్టలు ధరించిన ఒక వ్యక్తి.. రామరాజ్యం కోసం పనిచేసే వారిని కలవడానికి మీకు సమయం లేదా? అంటూ ‘టేక్ హిమ్ కస్టడీ’ అన్నట్లుగా రంగరాజన్ గుర్తు చేశారు. ఆ వ్యక్తి మాటలు విని ఎవరో పెద్ద అధికారై ఉంటారని తాను భావించానన్నారు.
ఆ తర్వాత సుమారు 20 మంది వ్యక్తులు ఒక్కసారిగా తలుపులు తోసుకుని ఇంట్లోకి ప్రవేశించారని రంగరాజన్ పేర్కొన్నారు. వారు నన్ను కాళ్లు పట్టి లాగి కిందపడేసి దాడి చేశారని, ఈ ఘటనతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. ఈ దాడిని తేలిగ్గా తీసుకునేది లేదని, దీనిపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిపై సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు వేస్తామన్నారు. ఈ దాడి వెనుక ఆలయానికి సంబంధించిన కోర్టు వివాదమే కారణమని రంగరాజన్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆలయానికి సంబంధించిన విషయం కోర్టు పరిధిలో ఉందని.. ఈ దాడి వెనుక ఎంత పెద్దవారు ఉన్నా సరే, శిఖండిలా తెర వెనుక ఉండి వ్యవహరించొద్దన్నారు. తమపై ఆరోపణలు చేసేవారు కోర్టులో వాదనలు వినిపించి, తాము తప్పు చేయలేదని నిరూపించుకోవాలని రంగరాజన్ సవాల్ విసిరారు.