హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదాల నివారణ పో లీసుల బాధ్యత మాత్రమే కాదని, పౌరులందరి బాధ్యత అని డీజీపీ శివధర్‌రెడ్డి చెప్పారు. యువత, విద్యార్థులు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణ కు కృషి చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవా రం ఎల్బీ స్టేడియంలో రోడ్డు ప్రమాదాల ని వారణ కోసం ఏర్పాటు చేసిన ‘అరైవ్ అలైవ్’ క్యాంపెయిన్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనార్, జాయింట్ సీపీ(ట్రాఫిక్ ) జోయల్ డేవిస్‌తో కలిసి డీజీపీ ప్రారంభించారు. సినీనటులు శర్వానంద్, ఆది, బాబూమోహన్, గాయకుడు మనో, దర్శకుడు బుచ్చిబాబు, నటి అర్చనతోపాటు పలువురు ప్రముఖులు, 8 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ ఏటా రోడ్డు ప్రమాదాల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒకరూ రూల్స్ పాటిస్తూ.. కుటుంబ సభ్యులు, ఇతరులు కూడా రూల్స్ పాటించేలా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల వీడియోల ను ప్రదర్శించారు. కుటుంబాలను కోల్పోయిన బాధితుల ఆవేదనను వెల్లడించారు.
రోడ్ సేఫ్టీపై విద్యార్థులకు క్విజ్ నిర్వహించారు. దేశంలో ఏటా 4.5 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు. బాబూమోహన్ మాట్లాడుతూ ‘నేను, మా అన్న కోట శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదాల రూపంలో మా కుమారులను కోల్పోయాము. నా నటనతో అందరినీ నవ్విస్తూ.. నేను 23 ఏండ్లుగా ఏడుస్తూనే ఉన్నాను’ అని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులు రూల్స్ పెట్టిందే ప్రజల కోసమని, ప్రజలే రూల్స్ పాటించకపోతే ఎలా అని శర్వానంద్ ప్రశ్నించారు. ప్రమాదానికి గురైనవారిని దవాఖానకు తరలించిన వారే నిజమైన హీరోలు అని చెప్పారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో పోలీసుల కృషి అభినందనీయమని బుచ్చిబాబు కొనియాడారు. కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలంటూ డైరెక్టర్ సుకుమార్ తనతో ప్రామిస్ చేయించుకున్నట్టు గుర్తుచేశారు. రోడ్డు ప్రమాదల వల్ల చాలా కుటుంబాలు బాధ పడుతున్నాయని, సీట్ బెల్ట్ ధరించి డ్రైవ్ చేయడం వల్ల తన బాబాయ్ కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారని ఆది చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ పాటించే బాధ్యత ప్రతీ ఒకరిపై ఉన్నదని నటి అర్చన చెప్పారు.