మెదక్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడిని తీవ్రతరం చేస్తామని, ఇందులోభాగంగా జూలై 17న రాష్ట్రవ్యాప్తంగా రైల్‌రోకో నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో బీసీ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర అ సెంబ్లీ పాస్ చేసిన బీసీ బిల్లును ఆమోదించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని బీసీ సంఘాలను కలుపుకొని రైల్‌రోకో చేస్తామని తెలిపారు.
ఢిల్లీ పాలకులకు తెలంగాణ బీసీల పౌరుషాన్ని చాటుతామని హెచ్చరించారు. ‘42% రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కుట్ర చేసున్నది. 42% రిజర్వేషన్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనీయం. బీసీ విద్యార్థులు, మహిళలు ఉద్యమం లో పెద్ద ఎత్తున కలిసిరావాలి’ అని కవిత పిలుపునిచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని చెప్పారు. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఒత్తిడితోనే అసెంబ్లీలో ప్రభుత్వం మూడు బీసీ బిల్లులు పెట్టిందని, అదే స్ఫూర్తితో కేంద్రం కూడా వాటిని ఆమోదించేలా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. వార్డు మెంబర్, సర్పంచ్‌లు కాని అనేక కులాలు బీసీల్లో ఉన్నాయని వివరించారు. మహిళా రిజర్వేషన్లలో బీసీలకు ఉప కోటా ఉండాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీకి బిల్లు పంపించి కాంగ్రెస్ ప్రభు త్వం చేతులు దులుపుకున్నదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు బీసీ బిల్లు గురించి ఒక్కరోజు కూడా మాట్లాడలేదని విమర్శించారు. రఘునందన్‌రావు బీసీల కోసం ఎందుకు మాట్లాడటం లేదు? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదు? అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కులగణన వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల వారీగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రౌండ్‌టేబుల్ సమావేశానికి రానివ్వకుండా బీసీ నాయకులను మెదక్‌లో కొంతమంది బెదిరించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూపీఎఫ్ స్టేట్ కన్వీనర్ బొల్లా శివశంకర్, స్టేట్ కో-ఆర్డినేటర్ అలకుంట హరి, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ఆచారి, నాయకులు సంపత్‌గౌడ్, ఈగ సంతోష్, నరేందర్‌యాదవ్, లింగం, ఆనంద్, లలితయాదవ్, మహేందర్‌ముదిరాజ్, శ్రీకాంత్, రాధాకృష్ణ, తేజ, యూపీఎఫ్ స్టేట్ కో-కన్వీనర్లు కొట్టాల యాదగిరి, విజయేంద్ర సాగర, కుమారస్వామి, గోపు సదానందం, తదితరులు పాల్గొన్నారు.