హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రభుత్వ చర్యలపై అన్ని వైపుల నుంచీ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఉలిక్కిపడ్డట్టు తెలిసింది. ఇందులో భాగంగానే నష్టనివారణ చర్యలకు దిగారు. మంగళవారం ఉదయం హుటాహుటిన మంత్రులతో సమావేశం నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క తదితరులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. వస్తున్న వ్యతిరేకతపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. ప్రతిపక్షాల విమర్శలను ఎలా తిప్పికొట్టాలి? వివిధ వర్గాల ప్రముఖులను ఎలా సముదాయించాలనే అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా ప్రభుత్వ చర్యలపై మంత్రుల నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది. ఒకేసారి పదుల సంఖ్యలో బుల్డోజర్లను పంపడం పొరపాటని, ముందుగా విద్యార్థులు, యూనివర్సిటీ అధికారులతో సంప్రదింపులు జరిపి ఉండాల్సిందని మంత్రులు చెప్పినట్టు సమాచారం. దీనిపై దూకుడు తగ్గించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ప్రతిపక్షాల ఆరోపణలపై హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులైన భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు ద్వారా సమాధానాలు చెప్పించాలని సీఎం కోరినట్టు సమాచారం. ఇందులో భాగంగానే సమీక్ష అనంతరం భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు ఇతర మంత్రులంతా కలిసి మీడియా సమావేశం నిర్వహించినట్టు స్పష్టమవుతున్నది.